అందరూ కలిసి జగన్పై యుద్ధానికి వస్తున్నారు
దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం
ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం
నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారు
మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి ప్రత్యేక ప్రతినిధి : ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తన వాళ్లనే చంద్రబాబు తన మీద ఉసిగొల్పుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో. కానీ, నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా. ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం తపించిపోతున్న ఒకరిద్దరు నావాళ్లు భాగం అయ్యారు. ఇంతటి దారుణం చేసి నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి?. ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం చేసినా నేను మాత్రం ప్రజల పక్షం ఉంటా అని గర్వంగా చెబుతున్నా. నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు. అందరూ కలిసి జగన్పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ నా పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. కానీ, నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజల అండగా, దేవుడి దయ ఉన్నాయి. విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి అన్నారు.
నా విజయాలకు కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు. 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చాం. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం. వైఎస్సార్ జిల్లా నేలమీద..ఈ పొద్దుటూరు గడ్డమీద..నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదు. ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడే. అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, భావితరాలు, మన గ్రామాలు, ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా కాబట్టే చెబుతున్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోందని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, చూసినా కోట్ల గుండెలు, మన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయన్నారు. కాబట్టే ఈ జెండా మరే ఇతర జెండాతోనూ జతకట్టడం లేదు. లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండి పోతుందన్నారు.
గట్టిగా గర్జించండి.. మేమంతా సిద్ధమేనని : పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్నా ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా?. మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు. మే 13న ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా?. 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది. ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు. వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు. హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు. పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి. దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం. నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా. చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు. మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది. చంద్రబాబు వదిన చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్ వచ్చాయి. తప్పు చేసేది వారు. నెపం నెట్టేది మనపై అని జగన్ అన్నారు.
ఇడుపులపాయలో జగన్తో వైఎస్ విజయలక్ష్మి : వైఎస్ విజయలక్ష్మి రాజకీయంగా తన కుమారుడి వైపే ఉన్నారని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన తర్వాత ఒక్క సారి కూడా షర్మిలతో కనిపించని విజయమ్మ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా ఇడుపుల పాయలో వైఎస్ సమాధికి నివాళి అర్పించేందుకు జగన్ కలిసి వచ్చారు. ప్రార్థనలు చేశారు. ఈ పరిణామంతో విజయమ్మ కుమారుడు జగన్ వైపే ఉన్నట్లు రాజకీయంగా సంకేతాలు వెళ్లినట్లే అనుకోవచ్చు.
రాజకీయంగా కుమారుడికే మద్దతు : రాజకీయంగా విజయలక్ష్మి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఇటీవల పరిణామాలు నిరూపిస్తున్నాయి. కుమార్తె తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత పూర్తిగా షర్మిలకే అండగా నిలిచారు. తెలంగాణలో షర్మిలకు అండగా ఉండటానికే అంటూ వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలిగా రాజీనామా చేశారు. తెలంగాణకు వెళ్లారు. అక్కడ షర్మిల చేసిన పోరాటాల్లో తాను కూడా పాల్గొన్నారు. షర్మిలను అరెస్టు చేసినప్పుడు పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు.