రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
వెలగపూడి నుంచి ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి పొందేందుకై ‘సువిధ’ పోర్టల్ ను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. ఇందుకోసం 48 గంటలకు ముందుగానే సువిధ యాప్ ద్వారా లేదా నేరుగా సంబందిత రిటర్నింగ్ అధికారికి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆన్లైన్ నామినేషన్లు, అఫిడవిట్ లను దాఖలు చేసేందుకు , ముందస్తు అనుమతులు మంజూరుకై ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు సుధా పోర్టల్ ను ఈసీఐ డిజైన్ చేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో నున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలు, ముందస్తుగా తీసుకోవాల్సిన అనుమతులను వివరించేందుకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది. అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, బి.జె.పి., సిపిఐ (మార్కిస్టు), ఇండియన్ నేషనల్ కాంగ్రేస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, టిడిపి, వైఎస్సార్సీపి తదితర పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.