శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్
అమరావతి బ్యూరో ప్రతినిధి : సీఎం జగన్ రెడ్డి ఆదేశానుసారంగా ఏపీ పోలీసులు ప్రవర్తిస్తున్నారని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల తరుణంలో రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలను పోలీసులు, వైసీపీ అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో ఎన్నికల కోడ్‌ను ఎప్పుడు ఉల్లంఘించలేదని చెప్పారు. ఎన్నికల కోడ్ ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారన్నారు. నారా లోకేష్ కాన్వయ్‌ని మాత్రమే టార్గెట్ చేసి రెండురోజుల్లో నాలుగు సార్లు తనిఖీ చేయడం దుర్మార్గమని చెప్పారు. ప్రతిపక్ష నాయకులనే టార్గెట్ చేసి కార్లను తనిఖీలు చేయడం వైసీపీ అరాచకపాలనకు నిదర్శనమన్నారు. గత ఐదేళ్లుగా పోలీసులు పక్షపాతంతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. లోకేష్‌ని కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికి వైసీపీ నాయకులు ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్న విధానాన్ని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా తప్పుడు ఆలోచనలు మానుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కోరుతున్నామని ఎంఏ షరీఫ్ అన్నారు.