‘సార్వత్రిక ఎన్నికలు`మీడియా పాత్ర’ అనే అంశంపై సదస్సు
శ్రీనివాసరెడ్డిని సన్మానించిన జర్నలిస్టులు, ప్రజాసంఘాలు
విజయవాడ : సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి జర్నలిజానికి ఉందని, దిగజారిపోతున్న వ్యవస్థలను నిలబెట్టేది మీడియానే అని ఇండియా జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షులు తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివారెడ్డి ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘సార్వత్రిక ఎన్నికలు`మీడియా పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు అధ్యక్షతన స్థానిక గాంధీనగర్ లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఎన్నికల సంఘం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తుందన్నారు. మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ వాస్తవాలను బయటపెట్టటానికి సంకోచిస్తుందన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత పెరిగిందని ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీస ఖర్చు రూ.10,702 కోట్లు ఉందన్నారు. రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోరల్ బ్యాండ్స్ ద్వారా డబ్బు సమకూరుతుందన్నారు. అంతేకాకుండా ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థల దాడుల చేయటం ద్వారా కూడా వేల కోట్ల రూపాయలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి డబ్బులు సమకూరుతున్నాయని చెప్పారు. దేశంలో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న 23శాతం ప్రజలు ఓటు వేసేందుకు డబ్బులకు ఆశపడి ఉండవచ్చునేమో గాని ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు కూడా ఓటుకు డబ్బులు తీసుకోవటం దారుణం అన్నారు. పత్రికల స్వేచ్ఛ. హక్కుల కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందని ఎలక్ట్రానిక్ మీడియాకు అలాంటి వ్యవస్థ లేకపోవటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానికి మీడియా, సోషల్ మీడియాలను ఒకే వ్యవస్థగా తీసుకొని మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని అనేక సార్లు కేంద్రానికి వినతిపత్రాలు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రధాన స్రవంతిలోని మీడియా బయటకు తీయలేని వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. స్వియ నియంత్రణ పాటించాల్సిన సోషల్ మీడియాలో విశృంఖలత్వం పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఉన్న చట్టాన్ని కేంద్రం రద్దు చేసి జర్నలిస్టులను మెడికల్ రిఫ్రజెంటెటీవ్స్ కేటగిరిలో చేర్చిందన్నారు. జర్నలిస్టులు యాజమాన్యాల పేరు చెప్పి తాము చేయాల్సిన బాధ్యతను సక్రమంగా చేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు, నేరారోపణలు ఉంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. మీడియానే ప్రజాస్వామ్యానికి కళ్లు అని స్పష్టం చేశారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వి.లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత ఎక్కువ కావటం వల్ల 5 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో 25 లోక్‌సభ అభ్యర్థుల కోసం 100 కుటుంబాలు, 175 అసెంబ్లీ అభ్యర్థుల కోసం 600 కుటుంబాలు మాత్రమే పోటీలో ఉంటున్నాయని చెప్పారు. ఎన్నికల్లో మద్యం కోసం చేసే ఖర్చు అత్యధికంగా ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత మద్యం వల్లనే ఎక్కువ మంది యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం నుంచి గౌరవవేతనం తీసుకుంటూ ఒక పార్టీకి ఓటు వేయమని చెప్పటం సమంజసం కాదన్నారు. మీడియా ఎప్పుడూ స్వాతంత్రంగా పని చేయలేదని, మీడియా యాజమాన్యాలకు అనుగుణంగా జర్నలిస్టులు పని చేస్తారని చెప్పారు. అయినా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, మంచి పనులను మీడియా ద్వారానే వెలుగు చూస్తున్నాయని చెప్పారు.
ప్రొఫెసర్ ఎంసీ దాస్ మాట్లాడుతూ మీడియా సంస్థలు ఓటు హక్కు, ఓటు వేసే బాధ్యతపై ప్రజలకు అవగాహన కలిగించాల్సి అవసరం ఉందన్నారు. కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే ప్రజలకు ఆంక్షలు విధించే పద్ధతి అమలులో ఉందన్నారు. మనదేశంలో దాదాపు 60 కుంభకోణాలను వెలికితీసింది మీడియానే అన్నారు. జర్నలిస్టులకు కనీస వేతన చట్టం, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాజ్యాంగం ఉల్లంఘన జరిగిన చోట సుప్రీంకోర్టు కల్పించుకుని చట్టబద్ధ రక్షణ కల్పిస్తేనే జర్నలిస్టులకు ధైర్యం ఉంటుందన్నారు.
ఐజేయూ కార్యదర్శి డి.సోమసుందర్ మాట్లాడుతూ మీడియా కమీషన్, వేజ్‌బోర్డు ఏర్పాటు, జర్నలిస్టులకు రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. మీడియాలో రూ.3లక్షల కోట్లు పెట్టుబడులు ఉన్నాయని వాటిలో 86శాతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేతిలో ఉన్నట్లు చెప్పారు. పెయిడ్ న్యూస్ వంటి మీడియాలో జరుగుతున్న అవినీతిని ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే సంఘాలు బయటపెట్టటం జరిగిందన్నారు. పౌర సమాజం చైతన్యం అయితేనే మీడియాకు స్వేచ్ఛవస్తుందన్నారు.
ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్‌కుమార్ మాట్లాడుతూ మీడియా యాజమాన్యాలు, జర్నలిస్టులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని వారిని విమర్శిస్తూ వార్తలు రాయటం సాధ్యం కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటరుకు మంచి సమాచారాన్ని అందించలేమని తద్వారా ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. విదేశాల్లో డిజిటల్ మీడియా పెరగటం ద్వారా ప్రజల్లో ఓటు, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పెరిగిందన్నారు.
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు, ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్‌లు ప్రసంగించారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి అతిథులకు స్వాగతం పకలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఎస్కే బాబు, రామసుబ్బారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియాఅసోసియేషన్ అధ్యక్షులు ఏల్చూరి శివ, విజయవాడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కంచర్ల జయరాజు, కార్యదర్శి దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఫొటో జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శి రూబిన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాసరెడ్డికి ఘన సన్మానం : తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి తొలిసారి విజయవాడకు వచ్చిన కె.శ్రీనివాసరెడ్డిని జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. విశాలాంధ్ర సంపాదక మండలి చైర్మన్ కె.రామకృష్ణ, విశాలాంధ్ర విజ్ఞాన సమితి చైర్మన్ ముప్పాళ్ల నాగేశ్వరరావులు శ్రీనివాసరెడ్డికి పుష్పగుచ్ఛం అందించి దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఎం.మురళీకృష్ణ ఆధ్వర్యంలో విశాలాంధ్ర సిబ్బంది సన్మానించారు. వీరితో పాటు విజయవాడ నగరంలోని వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు శ్రీనివాసరెడ్డిని ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా సి.రాఘవాచారి రాసిన సంపాదకీయల మూడవ సంపుటి ‘రాజ్యాంగం,న్యాయస్థానాలు, చట్టసభలు’ పుస్తకాన్ని సి.రాఘవాచారి ట్రస్ట్ సభ్యులు బి.జమందార్, అక్కినేని చంద్రరావు శ్రీనివాసరెడ్డికి అందించారు.