కులగణన ప్రక్రియపై బీసీ దళ్ ప్రతినిధి బృందం కీలక నిర్ణయం
బీసీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీతో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి భేటీ
అమరావతి : బలహీనవర్గాలు దశాబ్దాలుగా తమ వాటా తమకు ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణనకు ముందుకు రావడం శుభ పరిణామమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోడ్ అమలుకు ముందే జీవో ఎంఎస్ నెంబర్ 26 ద్వారా ప్రభుత్వం కుల గణన చేపడుతున్నట్టు ప్రకటించినందున తక్షణమే ఈ ప్రక్రియపై కసరత్తును మొదలు పెట్టాలని కోరారు. ఈ మేరకు ఆయన నాయకత్వంలో శుక్రవారం ఒక ప్రతినిధి బృందం సచివాలయం లో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంతో ప్రత్యేకంగా భేటీ అయింది. బలహీనవర్గాలు దశాబ్దాలుగా తమ వాటా తమకు ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణనకు ముందుకు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉత్తర్వులను జారీ చేయడం హర్షించదగ్గ పరిణామం అని కుమారస్వామి అన్నారు.
ఈ సందర్భంగా బుర్ర వెంకటేశం తో మాట్లాడుతూ కులగణన ప్రక్రియ చేపట్టడానికి ముందు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించడానికి ఒక సమగ్రమైన ప్రశ్నావళిని రూపకల్పన చేయవలసి ఉంటుందని సూచించారు. అదేవిధంగా ఎన్ యు మరెటర్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. నియమ నిబంధనలతో కూడిన కర దీపికను రూపొందించాల్సి ఉంటుంది. ఇవన్నీ ముందస్తుగా పూర్తి చేసుకొంటే కుల సర్వేకు మార్గం సులువు అవుతుందని ప్రతినిధి బృందం బుర్ర వెంకటేశం దృష్టికి తీసుకెళ్లారు. కాగా జూన్ నెల వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఆలోపుగా పైన పేర్కొన్న మిగతా విషయాలన్నీ పూర్తి చేసుకుంటే త్వరితగతిన సర్వేను చేపట్టి పూర్తిచేసే అవకాశం ఉంటుందని సూచించినట్లు ప్రతినిధి బృందం పేర్కొంది. మరోవైపు దుండ్ర కుమారస్వామి నేతృత్వంలో కలిసిన ప్రతినిధి బృందానికి కుల సర్వే పూర్తి చేయడంలో ప్రభుత్వం అన్ని చర్యలను చేపడుతుందని బుర్ర వెంకటేశం హామీ ఇచ్చారు. ఇప్పటికే జీవో 26 విడుదల చేసినందున విధివిధానాల ఖరారులో మిగతా అన్ని అంశాలను ప్రభుత్వం దశలవారీగా చేపడుతుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా కట్టుబడి ఉందని తెలిపారు.