న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ సాయంత్రం దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయన నివాసానికి చేరుకొని కేజ్రీవాల్‌ను విచారించింది. ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన్ను అదుపులోకి తీసుకుంది. తాజా పరిణామాలతో సీఎం ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం నివాసానికి ఆప్ నేతలు, పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు తరలివచ్చి ఆందోళన చేశారు. కేజ్రీవాల్ అరెస్టయినప్పటికీ ఆయన సీఎంగా కొనసాగుతారని దిల్లీ మంత్రి అతిషీ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టు పెద్ద కుట్రేనని ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో ఈరోజు ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్టయినప్పటికీ ఆయన సీఎంగా కొనసాగుతారని దిల్లీ మంత్రి అతిషీ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టు పెద్ద కుట్రతో కూడుకున్నదని ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ : ఇదిలా ఉండగా ఈ అంశంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు లీగల్ టీమ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం వరకు విచారణ చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది.
కేజ్రీవాల్ గొంతు అణచివేసేందుకే : ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయెల్
కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల రాకపై ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయెల్ స్పందించారు. మనీశ్ సిసోదియాను అరెస్టు చేసినా ఇప్పటివరకు ఏమీ దొరకలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ గొంతు అణిచివేసేందుకే ఆయన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారని గోయెల్ విమర్శించారు.