విజయవాడ ప్రత్యేక ప్రతినిధి : అందరితో మంచి సంబంధాలు కలిగి, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అతికీలకమైన సమాచార, పౌర సంబంధాల శాఖలో 30 సంవత్సరాలు ఉద్యోగ జీవితాన్ని కొనసాగించిన మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ సమాచారశాఖలో మణిపూస అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం విజయవాడలోని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ కార్యదర్శిగా పదవీ విరమణ చేయనున్న బాలగంగాధర్ తిలక్ ను ఐ&పీఆర్, కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉద్యోగ జీవితాన్ని కొనసాగించడమే కాక అజాతశత్రువుగా తిలక్ పేరు తెచ్చుకున్నారన్నారు. నేటి తరం ఉద్యోగులు తిలక్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన సమయంలో విజయవాడలో జాయింట్ డైరెక్టర్ హోదాలో మీడియా సెంటర్ ను విజయవంతంగా నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రభుత్వ సమాచారాన్ని మీడియా సంస్థలకు అందించారన్నారు. పదవిలో ఉన్నంతకాలం సంస్థ ప్రగతి కోసం కృషి చేసిన తిలక్ పదవీ విరమణ అనంతరం మంచి ఆరోగ్యంతో తమ జీవితాన్ని కుటుంబంతో సంతోషంగా గడపాలని కమిషనర్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ 1994 నుండి వివిధ హోదాల్లో 30 ఏళ్లు నిర్విరామంగా పనిచేసే అవకాశం కలిగినందుకు సమాచార, పౌర సంబంధాల శాఖకు, విధి నిర్వహణల్లో సహకరించిన సహోద్యోగులకు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. సంస్థ కోసం అహర్నిశలు కష్టపడే కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి సారధ్యంలో జాయింట్ డైరెక్టర్ పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం డీపీఆర్వోగా, భద్రాచలం ఐటీడీఏలో ఏపీవోగా, వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ గా, రాష్ట్ర విభజన అనంతరం విశాఖపట్నం రీజినల్ జాయింట్ డైరెక్టర్ విధులు నిర్వర్తించిన అనంతరం ప్రెస్ అకాడమీ కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తుండటం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత అధ్యక్షత వహించగా, జాయింట్ డైరెక్టర్లు పోతుల కిరణ్ కుమార్, కస్తూరి బాయి తేళ్ల, మణిరామ్, సూర్య చంద్రరావు, చీఫ్ ఇంజినీర్ మధుసూదన్ రావు, సమాచార, పౌర సంబంధాల శాఖలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన తిలక్ గురించి తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం కమిషనర్ చేతుల మీదుగా జ్ఞాపికను అందజేయడంతో పాటు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో తిలక్, ఉషారాణి దంపతులను ఘనంగా సన్మానించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారులు, అధికారులు, ఇతర శాఖల సిబ్బంది, జర్నలిస్ట్ సంఘాల నాయకులు సైతం తిలక్, ఉషారాణి దంపతులను సత్కరించారు.