గుంటూరు నుంచి ప్రధాన ప్రతినిధి : కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషకుమారి పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి. మిథున్‌రెడ్డి, పిఠాపురం వైఎస్సార్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాకినీడి శేషకుమారి మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికలలో 28 వేల ఓట్లు తనకు వచ్చాయని తెలిపారు. ‘పవన్ పార్టీకి ఒక నిబద్దతనేదే లేదు. పవన్‌ను జనం నమ్మే పరిస్థితి లేదు. జనసేనకి అసలు విధివిధానాలే లేవు. పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్థం చేసుకోలేడు. జనాసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. సీఎం జగన్‌తో అసలు పవన్‌ను ఎవరూ పోల్చుకోరు. సీఎం జగన్ స్థాయి వేరు. పవన్ చెప్పే సిద్ధాంతాలు మైకుల ముందే పరిమితం. ఆచరణలో ఏమీ చేయరని తెలిపారు.