రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు
సూర్యారావుపేటలోని ఇండ్లాస్ హాస్పిటల్లో అవిక యాప్ ఆవిష్కరణ
విజయవాడ బ్యూరో ప్రత్యేక ప్రతినిధి : ప్రస్తుత పరిస్తితుల్లో ప్రతి ఒక్కరికీ ఎంతోకొంత మానసిక ఒత్తిడి, సమస్యలు ఉంటున్నాయని అలాంటి వారందరికీ అవిక యాప్ గొప్ప వరమని రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. సూర్యారావుపేటలోని ఇండ్లాస్ హాస్పిటల్లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అవిక యాప్‌ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ మానసిక సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా రూపొందించిన అవిక యాప్ దేశంలోనే మొట్టమొదటిగా భావిస్తున్నట్లు తెలిపారు. అవిక యాప్‌ను రూపొందించిన ఇండ్లాస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ విశాల్ ఇండ్లను, అవిక టీమ్ సీఈవో శిరీష పెయ్యేటి బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
గౌరవ అతిధిగా పాల్లొన్న ఉన్నత విద్య శాఖ చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ అవిక యాప్ కేవలం మానసిక సమస్యలున్నవారికే కాకుండా పరీక్షల ఒత్తిడి, ఏకాగ్రత లేకపోవడం, బెట్టింగ్, ప్రేమ వ్యవహారాలు, డ్రగ్స్‌కు అలవాటు పడడం, ఆత్మహత్య తలంపులు, నిద్రలేమి లాంటి సమస్యలున్న వారికి కూడా ఉపయోగపడే గొప్ప సాధనమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యానివర్శిటీల విద్యార్థులకు కూడా అవిక యాప్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
వైయస్సార్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.బాబ్జి మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీని ఆధారం చేసుకుని రూపొందించిన అవిక యాప్ వైద్య రంగంలో ఒక విప్తవాత్మక అధ్యాయానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ఇండ్లాస్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అవిక మెడికల్ డైరెక్టర్ డాక్టర్ విశాల్ మాట్లాడుతూ అవిక యాప్ ప్రత్యేకతలను వివరించారు. అవిక యాప్ వైద్యులకు, రోగులకు ఒక మంచి వారధిగా పనిచేస్తుందని, రాబోయే రోజుల్లో మానసిక వైద్య సేవలు మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి వస్తాయన్నారు.
అవిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిరీష మాట్లాడుతూ పెరుగుతున్న మానసిక సమస్యలకు అధునాత వైద్య చికిత్సలు అందిస్తున్న ఇండ్లాస్ హాస్పిటల్స్‌తో కలిసి వినూత్న విధానాలను అందించేందుకు తమ సంస్థ ఈ విధంగా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. అతి త్వరలో అవిక సేవలను దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా విస్తరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అతిథులను అవిక టీమ్ సభ్యులు ఘనంగా సత్కరించారు.