4 ఏప్రిల్, 2024 న ముగియనున్న మూల్యాంకన ప్రక్రియ
బోర్డు ఆదేశాలకు అనుగుణంగా 23,000 మంది అధ్యాపకులచే మూల్యాంకన ప్రక్రియ
పారదర్శకంగా పదో తరగతి బోర్డు పరీక్షలు
పరీక్షా నిర్వహణ, పర్యవేక్షణ కోసం 35,119 మంది ఇన్విజిలేటర్లు, 156 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 682 సిట్టింగ్ స్వ్కాడ్లు
ప్రశ్న పత్రంలోని ప్రతి పేజీ పై భాగంలో క్యూఆర్ కోడ్ తో పాటు వాటర్ మార్క్ తో కూడిన వెబ్ డింగ్ ఫాంట్ కోడ్
పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఆధునిక మౌలిక వసతుల కల్పన
దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో అంధ విద్యార్థుల కోసం ఆడియో ప్రశ్నపత్రాల రూపకల్పన
గతేడాది పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను రెగ్యులర్ విద్యార్థులుగా నమోదు చేసే కొత్త విధానం రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం
పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభమవడమే గాక, ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో 4 ఏప్రిల్, 2024 వరకు మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. సుమారు 23,000 మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొని దాదాపు 60 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తారని వెల్లడించారు. ప్రతి కేంద్రంలో ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారుల పర్యవేక్షణలో 10వ తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. పదో తరగతి పరీక్షలు విద్యార్థి జీవితంలో కీలకమైన ఘట్టమని ఆయన అభివర్ణించారు. 1 నుండి 9 వ తరగతి వరకు తమ స్వంత పాఠశాల పరిసరాల్లో పరీక్షలు రాసిన విద్యార్థులకు బోర్డు పరీక్షలు కొత్త అనుభూతిని కలిగించి, కొత్త వాతావరణాన్ని పరిచయం చేస్తాయన్నారు.
పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఎప్పుడూ లేని విధంగా విద్యార్థులకు 100% బెంచ్ సీటింగ్, తాగునీటి కోసం RO ప్లాంట్లు, హై-ఎండ్ టాయిలెట్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, కొన్ని కేంద్రాల్లో ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు వంటి ఆధునిక మౌలిక వసతులు కల్పించడం విశేషమన్నారు. మార్చి 2024లో జరుగుతున్న ఎస్సెస్సీ పరీక్షలకు నమోదు చేసుకున్న 7,25,618 మంది విద్యార్థులకు 30,234 గదులు అందుబాటులో ఉన్నాయన్నారు. పరీక్షా నిర్వహణ, పర్యవేక్షణ కోసం 35,119 మంది ఇన్విజిలేటర్లు, 156 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 682 సిట్టింగ్ స్వ్కాడ్లు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. 130 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పరీక్షలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. పరీక్షలో అక్రమాలు జరగకుండా పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ప్రశ్న పత్రంలోని ప్రతి పేజీ పై భాగంలో క్యూఆర్ కోడ్ తో పాటు వాటర్ మార్క్ తో కూడిన వెబ్ డింగ్ ఫాంట్ కోడ్ కూడా ఉంటుందన్నారు. అంతేగాక సీసీటీవీ కెమెరాలను సైతం పర్యవేక్షణ కోసం వినియోగిస్తున్నామన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంధ విద్యార్థుల కోసం ఆడియో ప్రశ్నపత్రాలను ఫైలట్ ప్రాజెక్టుగా రూపొందించడం వినూత్నచర్యగా అభివర్ణించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న 12 మంది విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. భవిష్యత్ లో ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ఈ సౌకర్యం మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు, పాసైన విద్యార్థుల మధ్య వ్యత్యాసాన్ని మార్క్ షీట్లలో చూపించకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించిందని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. గతేడాది పరీక్షల్లో ఫెయిల్ అయిన 1,125 మంది విద్యార్థుల మార్కులను సబ్జెక్ట్ ల వారీగా పరిగణలోకి తీసుకొని మళ్లీ రెగ్యులర్ విద్యార్థులుగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు