చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన వంచన, దగా గుర్తొస్తాయి
ఒక్క గుర్తుండిపోయే పథకాన్ని చంద్రబాబు తీసుకురాలేదు
వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు పవన్
ఒకరికి విశ్వసనీయత, మరొకరికి విలువలు లేవన్న సీఏం జగన్
వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
కర్నూలు నుంచి ప్రత్యేక ప్రతినిధి : కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పామని, ఆ మాటకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం జిల్లాలో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజ, భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంది. హైదరాబాద్‌కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు. కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పాం. నేషనల్ లా యూనివర్శిటి నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కోరుకుంటున్నాను. రూ.1000 కోట్లతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. ఈ యూనివర్సిటీతో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఏపీ లీగల్ మెట్రాలాజీకల్ కమిషన్, లేబర్ కమిషన్, వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డ్, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నానని వ్యాఖ్యలు చేశారు.
పవన్ ఓ మ్యారేజ్ స్టార్ : నంద్యాల జిల్ల బసగానపల్లెలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుందని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి కూడా గుర్తుకు రాదన్నారు. ఒక్క గుర్తుండిపోయే పథకాన్ని బాబు తీసుకురాలేదని సీఏం జగన్ విమర్శించారు. ఇక దత్తపుత్రుడి పేరు చెబితే అక్కాచెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడని, ఐదేళ్లకొకసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ అని జనసేనానిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరికి విశ్వసనీయత, మరొకరికి విలువలు లేవు. ఇలాంటి వీళ్లు మూడు పార్టీలుగా కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారని జగన్ అన్నారు. ఇది ముమ్మాటికీ మీ బిడ్డ మీదకు కాదు.పేదవాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారని పేర్కొన్నారు. 2014లో ఇదే ముగ్గురు ఒక కూటమిగా మన మందుకు వచ్చారని ఈ సందర్భంగా సీఏం జగన్ గుర్తు చేశారు. ఇదే పవన్ బీజేపీతో కలిసి ఇప్పుడు చెబుతున్నట్లే.. అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారన్నారు. వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఒక్క మేనిఫెస్టో హామీ అయినా అమలు చేశారా? అని జగన్ ప్రశ్నించారు.
బాబు, పవన్‌కు విశ్వసనీయత, విలువల్లేవ్ : పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని.. ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు. బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ బనగానపల్లె నుంచి చేస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ.. తదితర ఓసీల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ ఏటా రూ.15,000 చొప్పున వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ మూడేళ్లపాటు సహాయం అందించే కార్యక్రమంమే ఈ వైఎస్సార్ ఈబీసీ నేస్తం. పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వైఎస్సార్ ఈబీసీ నేస్తంగానీ, వైఎస్సార్ కాపు నేస్తంగానీ మేనిఫెస్టోలో పెట్టినవి కావు. అయినా వారికి త తోడుగా ఉండాలని, పేదరికం వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని వారి కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఈరోజు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,19,528 మంది నా అక్కచెల్లెమ్మలకు 629 కోట్లు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తున్న ఈ సొమ్ముతో కలుపుకొంటే మూడు దఫాల్లో 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ రూ.1877 కోట్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా మంచి చేయగలిగాం. ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సాయం అందుకుంటున్న అక్కచెల్లెమ్మలు 65618 మంది అయితే, 107824 మంది నా అక్కచెల్లెమ్మలు ఇదే ఈబీసీ నేస్తం రెండు సార్లు పొందారు. 3,21,827 మంది అక్కచెల్లెమ్మలు మొత్తంగా మూడు సార్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధి అందుకున్నారు. అదే అక్కచెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తోడుగా నిలుస్తూ చేయిపట్టుకుని నడిపించగలిగితే, ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది. తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితి ఉంటుంది. వారి కుటుంబాలన్నీ బాగు పడే పరిస్థితి వస్తుంది.ూ ఈ వ్యాపారంతో నెలనెలా కనీసం 610 వేలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుందన్నారు.