ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ ఆహ్మద్ ను గెలిపించుకుందాం
నెల్లూరులో పార్టీ బలంగా ఉంది
ప్రతిపక్షాల విష ప్రచారాలను తిప్పికొట్టాలి
నగర కార్పోరేటర్లు,నాయకులకు దిశా నిర్దేశం చేసిన ఎంపి విజయసాయిరెడ్డి
నెల్లూరు బ్యూరో ప్రతినిధి : రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి ఎండి ఖలీల్‌ను కలిసికట్టుగా గెలిపించుకుందామని నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులకు నెల్లూరు పార్లమెంటు సమన్వయకర్త వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. నగరంలో ఎంపీ అభ్యర్ది క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన ఎటువంటి నష్టం లేదని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలని కోరారు. గొప్ప చరిత్ర ఉన్న నెల్లూరు నగరపాలక సంస్థ (కార్పొరేషన్) సభ్యులైన మీతో సమావేశమవడం సంతోషకరంగా ఉందన్నారు.నెల్లూరు నగరం కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయ్యాక జరిగిన మూడో ఎన్నికల్లో మీరంతా కార్పొరేటర్లుగా ఎన్నికై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగరాభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. 2021 నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించడానికి వెనుక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన, జిల్లా సీనియర్ నాయకులు, మీ అందరి కృషి ఉందన్నారు. 2024 జోడు ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానం అలాగే నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మీతో సహా మన పార్టీ నేతలందరిపై ఉందన్నారు. నెల్లూరు పట్టణ చరిత్రలో తొలిసారి నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ముస్లిం మైనారిటీ నేత ఎం.డి ఖలీల్ అహ్మద్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారని చెప్పారు. పట్టణ చరిత్రలో ఇంతవరకు ముస్లిం అభ్యర్థి ఏపీ అసెంబ్లీకి వెళ్లే అవకాశం దక్కలేదని అన్నారు. అల్పసంఖ్యాకవర్గాల సంక్షేమంపై పార్టీ అధినేతకున్న అంకితభావం వల్లే ఖలీల్ గారిని సిటీ నియెజకవర్గ ఇన్ చార్జిగా నిర్ణయించారని అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే ఒక ముస్లిం అభ్యర్థి శాసనసభకు ఎన్నికవడం 1955 ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయగిరి నుంచి జరిగిందని, కాంగ్రెస్ తరపున పోటీచేసిన షేక్ మౌలానా సాహెబ్ ఆ ఎన్నికల్లో గెలిచారని గుర్తు చేశారు. మళ్లీ 68 సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లా ప్రజలకు ఒక మైనారిటీ అభ్యర్థిని అసెంబ్లీకి పంపించే అవకాశం వచ్చిందని చెప్పారు. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ముస్లిం సోదరులకు నగరం నుంచి చట్టసభకు వెళ్లే అవకాశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇస్తోందన్నారు.
నెల్లూరు ఎంపీ సీటు జనరల్ గా మారినప్పటి నుంచి తన అభ్యర్థిని ఇక్కడి నుంచి గెలిపించుకోలేక పోయిన ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ ఓడించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు మీరందరూ ఎప్పటిలాగే జనం మధ్య తిరుగుతూ పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను. పార్టీ నాయకత్వంతో సంప్రదించి దీర్ఘకాల సమస్యలు ఒక కొలిక్కి తీసుకురావడానికి అవసరమైన హామీలు ఇస్తూ పార్టీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన పార్టీ అవతరించాక 2014, 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన నాయకుడు (పోలుబోయిన అనిల్ కుమార్)కి ఈ జోడు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున మరో స్థానం నుంచి లోక్ సభకు పోటీచేసే అవకాశం లభించింది. దీంతో నెల్లూరు సిటీ నుంచి ఇప్పుడు కొత్త అభ్యర్థిని, అదీ మైనారిటీ వర్గానికి చెందిన అభ్యర్థిని పార్టీ బరిలోకి దింపిందన్నారు. ఈ నేపథ్యంలో మీరంతా అకుంఠిత దీక్షతో ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కష్టపడి పని చేయాలని కోరారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున నిలబడే పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల అఖండ విజయానికి మీ వంతు కృషి చేయండి. అప్పుడు రాష్ట్రంలో ‘రాజన్య రాజ్యాన్ని’, సంక్షేమ పాలనను మరో ఐదు సంవత్సరాలు కొనసాగించే అవకాశం మనకు తప్పకుండా వస్తుంది. పురపాలక సంస్థ , నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన మీ వంటి నాయకులు మున్సిపల్ చైర్మన్లు లేదా మేయర్లుగా ఎన్నికవ్వడమేగాక అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎన్నికైన సందర్భాలు గతంలో ఉన్నాయన్నారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ ఎండి ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.