గుంటూరు నుంచి ప్రత్యేక ప్రతినిధి : ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వలసలు పెరిగిపోతున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలో తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పెందుర్తి నేత గండి రవికుమార్ టీడీపీని వీడారు. బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గండి రవికుమార్‌తో పాటు స్థానిక టీడీపీ నేత ప్రసాదరావులకు సీఎం జగన్ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరామ్ తదితరులు పాల్గొన్నారు.
కవయిత్రి మొల్ల కు సీఎం నివాళులు : నేడు 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి. మొల్ల జయంతి సందర్భంగా ఆమెకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్ర పటానికి సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు వరుదు కళ్యాణి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ మండేపూడి పురుషోత్తం పాల్గొని నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.
16న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా : వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ఈనెల 16న విడుదల చేయనున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు సమన్వయకర్తల పేరుతో వైసీపీ 12 జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తుది జాబితా సిద్ధమైన నేపథ్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. నగరి, సత్తెనపల్లి, నరసరావుపేట తదితర నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో స్థానిక నేతలతో చర్చించారు.