రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
వెలగపూడి నుంచి ప్రత్యేక ప్రతినిధి : త్వరలో ఎన్నికల షెడ్యూలు ప్రకటించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పెండింగ్ ఫార్ముల పరిష్కారం, ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారులు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను సచివాలయం నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే అమల్లోకి రానున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టంగా అమలు పర్చేందుకు జిల్లా ఎన్నికల అధికారులు మరియు అన్ని జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్ల కలసి కొద్దిసేపట్లో సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహిస్తున్న ఈ సమీక్షా సమావేశంలో సాయంత్రం 4.00 గంటల తదుపరి అన్ని జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు కూడా పాల్గొననున్నారన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవోలు కె. విశ్వేశ్వరరావు, ఎస్.మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.