గోపాలపురం : గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుకు అవసరమైన అన్ని సేవలు గ్రామంలోని జగనన్న ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. రైతులందరూ సంతోషంగా ఉండాలని, వ్యవసాయం అంటే పండగలా చేసుకోవాలని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. గోపాలపురం మండలం వేళ్ళచింతల గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆదివారం హోం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందన్నారు. విత్తనం దగ్గర నుంచి పంట విక్రయం వరకూ అన్ని వేళలా రైతులకు జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా పండిన ధాన్యాన్ని మంచి గిట్టుబాటు ధరతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. నవరత్నాలలో భాగంగా రైతు భరోసా సాయం కింద దేశంలో ఎక్కడా లేనివిధంగా కౌలు రైతులకు సైతం సంవత్సరానికి రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ, బీజేపీ నుంచి వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు : గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం గ్రామంలో రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో టీడీపీ, బీజేపీ ల నుంచి వైసీపీలోకి భారీగా కుటుంబాలు చేరాయి. పార్టీ మారుతున్న నాయకులకు వైసిపి కండువాలు కప్పి హోం మంత్రి తానేటి వనిత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వేళ్ళచింతలగూడెం నుండి బేదంపూడి గంగాజలం, బేధంపూడి వెంకట్రావు, సాయిల బాబురావు, జొన్నకూటి సువర్ణ రాజు, కవులూరి చిన్న వెంకటరావు, కవులూరి పెద వెంకట్రావు, కుక్కల రామారావు తదితర 30 కుటుంబాల వరకూ టీడీపీ, జనసేన పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కి ఆకర్షితులై వివిధ పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.