రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
తణుకు : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే అమలు చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల, వినియోగదారులు శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూలు క్రీడా ప్రాంగణంలో ఆదివారం తణుకు నియోజవర్గ పరిధిలో నిర్వహించిన వైఎస్సార్ చేయూత 4వ విడత పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 45 నుంచి 60 సంవత్సరాల్లోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలందరికీ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18750లు చొప్పున నాలుగు విడతల్లో ఒక్కొక్కరికి రూ. 75వేలు చొప్పున అందచేసి ఆర్థిక భరోసా కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలంతా అండగా నిలబడాలని కోరారు. అటువంటి మహనీయుడి కొలువులో మంత్రిగా ఉన్నందుకు నా జీవితం ధన్యమని స్పష్టం చేశారు. మీ బిడ్డల చదువులకు మీ కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుందనే ఉద్దేశ్యంతో కోట్లాది రూపాయిలు వెచ్చించి పేదింటి విద్యార్థుల కోసం అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాదీవెన. వసతి దీవెన వంటి పథకాలతో పేదల విద్యకు పెద్దపీట వేసి ప్రోత్సహించారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కట్టుకట్టుకుని జగనన్నపై పోరాటానికి వస్తున్నాయని, పెత్తందార్లకు, పేదల పక్షాన నిలిచిన జగనన్న మధ్య జరిగే యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
మహిళలకు ఆర్థిక భరోసా : మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసి వారి కుటుంబాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ చేయూత ద్వారా ఈ నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ. 75వేలు చొప్పున లబ్ది చేకూర్చారని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. పేదల సౌకర్యార్ధం విద్యా, వైద్యానికి పెద్దపీట వేసి భారీగా నిధులు కేటాయించారని స్పష్టం చేశారు. తణుకు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే సత్తా మంత్రి కారుమూరికి ఒక్కరికి మాత్రమే ఉందన్న విషయాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలని సూచించారు.
జగనన్నను మరల సీఎంగా చేసుకోవాలి : 58 నెలల కాలంలో సంక్షేమం పేరుతో మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన జగనున్న ప్రభుత్వాన్ని మరల తెచ్చుకునేందుకు మహిళలంతా కృషిచేయాలని నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పిలుపునిచ్చారు. ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించి రాబోయే ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తున్నాయని, అర్హతే ప్రామాణికంగా అన్ని కులాలు, వర్గాలకు సంక్షేమం అందుతున్న తీరును ప్రజలు గమనించాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీల్లో కోట్లాది రూపాయిలు చెల్లిస్తేనే కానీ ఎంపీ సీటుకు దక్కని పరిస్థితి నేడు ఉందని, జగనన్న మాత్రం ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బీసీ మహిళగా నన్ను గుర్తించి ఎంపీ సీటు ఇచ్చారని చెప్పేందుకు గర్వపడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయూత చెక్కు నమూనాను మంత్రి కారుమూరి ఆవిష్కరించారు. నియోజకవర్గ పరిధి నుంచి వేలాదిగా మహిళలు తరలిరావడంతో సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు డి. శ్రీలలిత. పద్మజ్యోతి, రామారావు. ఏఎంసీ మాజీ చైర్చర్ చిట్టూరి శ్రీవెంకట సుబ్బారావు, ఏఎంసీ చైర్మన్లు నత్తా కృష్ణవేణి, బుద్దరాతి భరణిప్రసాద్, డీసీఎంఎస్ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, ఎంపీపీ రుద్రా ధనరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు ముళ్లపూడి. అన్నపూర్ణాదేవి, తణుకు పట్టణ, తణుకు రూరల్, అత్తిలి. ఇరగవరం మండల అధ్యక్షులు మంగెన సూర్య, బోడపాటి వీర్రాజు, పైబోయిన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గా ప్రసాద్, జిల్లాపరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండీ హబీబుద్దీన్, నియోజకవర్గ పరిశీలకులు జక్కంశెట్టి రాజేంద్రప్రసాద్, జేసీఎస్ అత్తిలి కన్వీనర్ షెన్మెత్స రామరాజు, దువ్వ సర్పంచ్ అడ్డా బాబు, తణుకు ఎస్సీ సెల్ అధ్యక్షులు పొట్ల సురేష్, వైసిపి నాయకులు ఉమ్మడిసింగ్ శ్రీనివాస్, షేక్ జిలానీ పాల్గొన్నారు.
కారుమూరి సేవా సమితి ద్వారా రూ.1 లక్ష ఆర్థికసాయం : ప్రమాదవశాత్తూ మరణించిన చిన్నారి చిక్కా విజయలక్ష్మి(5) కుటుంబానికి అండగా నిలబడతామని రాష్ట్ర పౌరసరఫరాల మరియు వినియోగదారులు శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఇటీవల ప్రైవేటు స్థలానికి చెందిన గోడకూలి చిన్నారి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆదివారం ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన మృతురాలి తల్లి వేణి మంత్రి కారుమూరిని క్యాంపు కార్యాలయంలో కలవగా కారుమూరి సేవాసమితి నుంచి రూ.1 లక్ష ఆర్థికసాయం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ ఘటనలో ఉన్న ఒక్క కుమార్తెను కోల్పోవడం చాలా బాధాకరమని ఆ కుటుంబానికి భరోసాగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి కొమ్మోజు రామకృష్ణ, బాధిత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.