45 రోజుల్లో జగన్ మాజీ ఎమ్మెల్యే అవుతారు
రాజంపేటలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
పులివెందులలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం
శ్రీకృష్ణ ఆలయానికి రూ. 10 లక్షల విరాళం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కు పార్టీ శ్రేణుల నుండి ఘన స్వాగతం లభించింది. రాబోయే ఎన్నికలకు క్యాడర్ ను సన్నద్దం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవేళ రామచంద్ర యాదవ్ ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని రామచంద్ర యాదవ్ ప్రారంభించారు. అనంతరం అన్నమయ్య ప్రాజెక్టు బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రాజెక్టును సందర్శించారు.
పులివెందులలో ఘన స్వాగతం : తదుపరి పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలతో ఆత్మీయ సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు.. ఈ క్రమంలో దారి పొడవునా శ్రేణులు ఘనస్వాగతం పలికారు.. గజ మాలలతో సత్కరించి, అడుగడుగునా పూలతో స్వాగతించారు.. అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో రామచంద్ర యాదవ్ ప్రసంగించారు. రాజంపేటలో, పులివెందుల్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు రామచంద్ర యాదవ్ పై పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. పార్టీ సమీక్ష సమావేశంలో రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి రాజకీయంగా ఇవే చివరి రోజులని అన్నారు. మరో 45 రోజుల్లో ఆయన మాజీ అవుతారని రామచంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. సొంత జిల్లాకు, సొంత నియోజకవర్గానికి, సొంత కుటుంబానికి కూడా అన్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అంటూ రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు.
శ్రీ కృష్ణ దేవాలయానికి రూ. 10 లక్షల విరాళం : పులివెందులలోని శ్రీకృష్ణ ఆలయాన్ని రామచంద్ర యాదవ్ సందర్శించారు. ఆలయ సిబ్బంది, అర్చకులు ఘన స్వాగతం పలుకగా, అక్కడ పూజలు చేశారు.. ఆలయ అభివృద్ధి నిమిత్తం రూ. పది లక్షల తక్షణ విరాళాన్ని ప్రకటించి, అందించారు. అనంతరం నియోజకవర్గంలో పర్యటించారు. రాష్ట్రంలో దోపిడీ పాలనను అంతం చేయడానికి ప్రజలంతా సిద్దంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుత జగన్మోహనరెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడం వల్ల యువత నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతున్నారన్నారు. అలానే రైతులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు అనేక సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జగన్ సర్కార్ లో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం, అన్ని వర్గాలకు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి బీసీ యువజన పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీ కీలక భూమికను పోషించనుందని అన్నారు. కార్యక్రమం విజయవంతానికి విచ్చేసిన పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదులు తెలియజేశారు.