సిద్దం సభలో రానున్న ఐదేళ్లలో చేపట్టే కార్యక్రమాలు వివరించనున్న సీఎం జగన్
పదేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్ చూసి జగన్ ప్రభుత్వంలో జరిగిన మేలు గమనించండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
విజయవాడ : ఎన్నికల ప్రకటనకు ముందు అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల వద్ద ఈ నెల 10న జరగనున్న చివరి నాల్గవ సిద్దం మహాసభకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాటు చేస్తున్నామని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో శుక్రవారం పలు అంశాలు వెల్లడించారు. సిద్దం మహా సభలో గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని వివరించడంతో పాటు ఎన్నికల్లో గెలిచిన తరువాత రానున్న ఐదేళ్లలో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో వివరిస్తారని అన్నారు. గడిచిన 10 సంవత్సరాల బ్యాంకు స్టేట్మెంట్ తీసుకొని 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు వివిధ పథకాల ద్వారా చేసిన మేలెంత, ఎన్ని లక్షల రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు, అలాగే అంతకు ముందు 2014-19 వరకు చంద్రబాబు పాలనలో కనీసం ఒక్క రూపాయి అయినా పడిందా అన్న విషయాన్ని లబ్దిదారులు బేరీజు వేసుకోవాలని కోరారు. సంక్షేమ పాలనతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచిన జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత మెరుగైన సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ కలిస్తే పాత వస్తువే కొత్త ప్యాకింగ్ తో వచ్చినట్లు ఉంటుందని, తేడా ఏమీ ఉండదని, ప్రతిపక్షాలన్నీ ఏకమైనా జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని అందుకు సిద్దం సభలకు ప్రజల నుంచి లభిస్తున్న విశేష ఆదరణే నిదర్శనమని విజయసాయి రెడ్డి అన్నారు. గత చంద్రబాబు నాయుడు పాలనలో 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రజలకు చేసిన మోసం, అమలు చేయని హామీలు, ఆడిన అబద్ధాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. మూడు కాళ్ల కుర్చీ పడిపోక తప్పదని స్థిరమైన పాలన కోసం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఓటు వేయాలని విజయసాయి రెడ్డి కోరారు.