విజయవాడ : రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ బోర్డు మేనేజింగ్ కమిటీ సమావేశం ఆంధ్రప్రదేశ్ గవర్నర్, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎస్.అబ్దుల్ నజీర్ అధ్యక్షతన మంగళవారం రాజ్ భవన్లో జరిగింది. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ వి . వెంకట రెడ్డి సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పనితీరు, గత సంవత్సరాల్లో నిర్వహించిన కార్యక్రమాల గురించి కమిటీ సభ్యులకు వివరించారు. రిటైర్డ్ సైనికులు, డిపెండెంట్ల సంక్షేమం కోసం అమలు చేసిన ప్రస్తుత పథకాలను సమీక్షించడానికి, వివిధ పథకాల కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు, గ్రాంట్లు మొదలైన వాటి పెంపునకు ప్రతిపాదించిన నిర్ణయాలను రాష్ట్ర మేనేజింగ్ కమిటీ పరిశీలన కోసం సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కమిటీ సభ్యులకు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్. జవహర్‌రెడ్డి, హోం శాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, తెలంగాణ & ఆంధ్ర సబ్ ఏరియా సికింద్రాబాద్ మేజర్ జనరల్ రాకేష్ మనోచా, హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి జి. విజయ్ కుమార్, హెచ్‌క్యూ డైరెక్టర్ బ్రిగ్. రోహిత్ మెహతా, సదరన్ కమాండ్ పూణే జాయింట్ సెక్రటరీ ఎ.కె. ధర్ తదితరులు పాల్గొన్నారు.