గెలిచి విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
ఈసారి విశాఖలోనే ప్రమాణస్వీకారం
ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే ఉంటా
వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచి పాలన సాగిస్తా
* అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదు*
శాసన రాజధానిగా అది కొనసాగుతుంది
విశాఖ వంటి పెద్ద నగరం రాష్ట్రానికి అవసరం
‘విజన్ వైజాగ్’ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
విశాఖపట్నం : మూడు రాజధానులంటూ ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెడుతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖ జపం చేశారు. నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. చెన్నై, హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. ‘విజన్ వైజాగ్’ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే ఉంటా. ఈసారి సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా. నగర అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళిక అవసరం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయలేదు. కేంద్రం సహకారం ఉండాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య నమూనా కావాలి. సమష్టిగా కృషి చేస్తేనే విశాఖ నగరం మారుతుంది. అమరావతికి నేను వ్యతిరేకం కాదు. శాసన రాజధానిగా అది కొనసాగుతుంది. అక్కడ 50వేల ఎకరాల బీడు భూమి తప్ప ఏమీ లేదు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని వ్యాఖ్యానించారు.
విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఎన్నికల్లో ఈసారి కూడా విజయం తమదేనని, మళ్లీ గెలిచి విశాఖ నుంచి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని తెలిపారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి ఇప్పటికే శాసనరాజధానిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామని, అందుకే విశాఖ వంటి పెద్ద నగరం రాష్ట్రానికి అవసరం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళుతోందని అన్నారు. హైదరాబాద్ కంటే విశాఖలో అభివృద్ధి అధికంగా జరుగుతోందని వివరించారు. బెంగళూరు కన్నా విశాఖలోనే మెరుగైన సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ, విపక్షానికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కోర్టు కేసులతో విపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖపై విషం చిమ్ముతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.