తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో చండ మేళం, కోలాటం, చక్క భజనలు తదితర కళాప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన శ్రీ వీరాంజనేయ బృందం చండమేళం (కేరళ డ్రమ్స్) వాయిస్తున్నారు. కేరళ డ్రమ్స్ బృందంలో మొత్తం 18 మంది కళాకారులు ఉన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. ఈ వాయిద్య ప్రదర్శన అలరించింది. తిరుపతికి చెందిన రేవతి ఆధ్వర్యంలో శ్రీ వైభవ వేంకటేశ్వర కోలాట భజన బృందంలోని 20 మంది స్థానిక మహిళా కళాకారులు కోయవాళ్ళ వేషధారణలో కోలాటాలు, నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కీలపూడికి చెందిన శ్రీ అభయ ఆంజనేయ కోలాట భజన బృందములోని 7 నుండి 12 సంవత్సరాల వయస్సు గల విద్యార్థిని విద్యార్థులు కోలాటం, చక్క భజనల ప్రదర్శన చేశారు. టంగుటూరుకు చెందిన శ్రీ సాయి లక్ష్మీ శ్రీనివాస భజన బృందంలోని 20 మంది కళాకారులు, గాజులమండ్యం కు చెందిన 20 మంది కళాకారుల కోలాటాలు భక్తులను ఆకర్షించాయి.