రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా
అమరావతి : ఎన్నికల ప్రక్రియలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులను పూర్తి స్థాయిలో భాగస్వామ్యులను చేసేందుకు అవసరమైన వర్కుషాలను ఈ నెల 10 తేదీలోపుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికల నిర్వహణలో ఎటు వంటి ఆరోపణలకు తావు లేకుండా ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు వీరి సహకారం, భాగస్వామ్యము ఎంతో అవసరమని, అందుకై ఎన్నికల షెడ్యూలు ఖరారు కాకముందే, ఈ వర్కుషాపులను నిర్వహించాలన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన మీడియో కాన్పరెన్సు నిర్వహించి ఎన్నికల సంసిద్దతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ గుర్తింపు కార్డులు ముద్రణ పూర్తి అయిన వెంటనే జిల్లా ఎన్నికల అధికారులకు అందుతున్నాయని, అయితే వీటి పంపిణీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకై ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెండింగ్ ఫార్ములను పరిష్కరించడములో ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పని సరిగా పాటించాలని, అందుకు తగ్గట్టుగా రికార్డులను నిర్వహించని ఇ.ఆర్.ఓ.ల చర్యలు తీసుకుంటామన్నారు. ఇ.ఆర్.ఓ.లు సరిగా రికార్డులు నిర్వహిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారులు ర్యాండమ్ గా చెక్ చేస్తూ వుండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ను జిల్లా ఎన్నికల అధికారులు తప్పని సరిగా సందర్శిస్తూ ఉండాలని, స్థానికులతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఎన్నికల ప్రక్రియపై సరైన విశ్వాసాన్ని పాదుకొలపాలన్నారు.
అదే విధంగా మీడియా సెల్, సోషల్ మీడియా సెల్, కంట్రోల్ రూమ్ లను సాద్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకించి సోషల్ మీడియా సెల్ లో నోడల్ అధికారి నియామకంతో పరిమితం కాకుండా సోషల్ మీడియా నిర్వహణపై నిపుణులైన వారి కనీసం ముగ్గురుని నియమించి, పలు రకాలైన సోషల్ మీడియా ప్లాట్ ఫార్ములను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. ప్రత్యేకంగా స్టాండర్డు ఆపరేషన్ ప్రొసీజర్ ను రూపొందించుకుని కంట్రోల్ రూమ్ ను నిర్వహించాలన్నారు. కంప్లైంట్ మేనేజ్మెంట్, రిపోర్టు మేనేజ్మెంట్ మరియు పోల్ డే మేనేజ్మెంట్ అప్లికేషన్లను రూపొందించడం జరిగిందని, వాటిని సక్రమంగా వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అందరూ సరైన అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎన్నికలను నిర్వహించే విధంగా అప్డేటెడ్ జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు రూపొందించి ఈ నెల 10 వ తేదీలోపు తమకు అందజేయాలన్నారు. అదే విధంగా ఫిర్యాధులు & ప్రతికూల వార్తల పరిష్కారం, పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవో లు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవో కె. విశ్వేశ్వరరావు, అసిస్టెంట్ సీఈవో టి.తాతబ్బాయ్, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.