అమరావతి : అమరావతిలో మార్చి 2, 3 తేదీల్లో బీజేపీ ముఖ్య నేతల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ సహ సంఘటన్ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరు కానున్నారు. ఈ సమావేశాలకు రావాలని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలకు, జిల్లా ముఖ్య నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈ సమావేశాల్లో పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మీడియా తో మాట్లాడుతూ పొత్తులకు సంబంధించి పవన్ కల్యాణ్ అధిష్ఠానం అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఆయన పదేపదే అధిష్ఠానం అని అంటున్నారు? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ప్రశ్న పవన్ కల్యాణ్ నే అడగాలని పురందేశ్వరి బదులిచ్చారు. పై నుంచి తిట్లు తింటున్నానని కూడా పవన్ కల్యాణ్ చెబుతున్నారు. దీనిపై మీరేమంటారని ఆ మీడియా ప్రతినిధి మరోసారి పురందేశ్వరిని అడిగారు. అందుకు పురందేశ్వరి స్పందిస్తూ ‘దానికి కూడా వివరణ ఆయనే ఇవ్వాలి. నేను కాదని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందా?. బీజేపీ-జనసేన-టీడీపీ పొత్తు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా పొత్తులను తమ అగ్రనాయకత్వం నిర్ణయిస్తుందని పురందేశ్వరి పునరుద్ఘాటించారు.