శ్రీశైలం : మల్లికార్జునుడు కొలువైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ఛైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేశారు. శివ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, చండీశ్వర పూజ చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. రాత్రి 7 గంటలకు ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శనివారం నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్ల వైభవాన్ని తిలకించేందుకు నల్లమల అడవుల గుండా భక్తులు పాదయాత్రగా తరలివస్తున్నారు. ఈ నెల 11 వరకు శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 2న భృంగి వాహన సేవ, 3న హంస వాహన సేవ, 4న మయూర వాహన సేవ, 6న రావణ వాహన వాహనం, పుష్పపల్లకి సేవ, 7న గజ వాహన సేవ, 8న నందివాహన సేవ, 9న రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.