వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ కృష్ణ బాబు సమక్షంలో నాట్కో ప్రతినిధుల ఎంఓయూ
నాట్కో క్యాన్సర్ సెంటర్ కు 120 పోస్టుల్ని మంజూరు చేశాం
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం టీ కృష్ణ బాబు
రూ.60 లక్షల విలువైన ఉచిత మందుల్ని అంజేసిన నాట్కో ప్రతినిధులు
గుంటూరు : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జిజిహెచ్) లోని నాట్కో సెంటర్ ను ఇటీవల లెవెల్ -1 క్యాన్సర్ సెంటర్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం క్యాన్సర్ సెంటర్ లో ఇప్పుడున్న వంద పడకలకు అదనంగా మరో వంద పడకలతో మరిన్ని వసతుల్ని ఏర్పాటు చేసేందుకు ఈ సెంటర్ ను ఆనుకుని ఉన్న 1500 గజాల స్థలాన్ని నాట్కో ట్రస్ట్ కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇందుకు సంబంధించిన అవగాహనా ఒప్పంద పత్రాల్ని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణ బాబు సమక్షంలో నాట్కో ఫార్మా వ్యవస్థాపకులు , నాట్కో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ వి.సి.నన్నపనేని, డిఎంఇ డాక్టర్ నరసింహం మంగళవారం మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ ఆరో ఫ్లోర్ లోని స్పెషల్ సిఎస్ ఛాంబర్లో మార్పిడి చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో ఈ క్యాన్సర్ సెంటర్ లో రేడియేషన్ , మెడికల్, సర్జికల్ విభాగాల్ని ఏర్పాటు చేయడం వల్ల క్యాన్సర్ రోగులకు సమగ్ర చికిత్స అందుతుందని , అలాగే అన్ని విభాగాలలో వైద్యులు ఉండేట్లు చర్యలు తీసుకున్నామన్నారు. క్యాన్సర్ చికిత్స నిర్ధారణ కోసం అవసరమైన పెట్ సిటి మెషిన్ కొనుగోలుకు కూడా టెండర్లు పిలిచామన్నారు. ఈ సెంటర్లో శిక్షణ పొందిన నర్సులు మాత్రమే పని చేసే విధంగా 30 ప్రత్యేక పోస్టుల్ని కూడా మంజూరు చేశామని, ఇక్కడ అవసరమైన మొత్తం 120 పోస్టుల్ని మంజూరు చేశామన్నారు. వి. సి. నన్నపనేని మాట్లాడుతూ ఈ స్థలంలో సుమారు 35,000 చదరపు అడుగుల్లో అదనంగా 100 పడకల క్యాన్సర్ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాట్కో ఫార్మా ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివ రావు, క్యాన్సర్ సెంటర్ సమన్వయ కర్త యడ్లపాటి అశోక్ కుమార్, గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు. నాట్కో క్యాన్సర్ సెంటర్ లో రోగులకు ఉచిత మందుల పంపిణీ లో భాగంగా ఈ త్రైమాసికానికి గాను 60 లక్షల రూపాయల విలువైన మందుల్ని స్పెషల్ సియస్ కృష్ణ బాబుకు వి.సి. నన్నపనేని ఈ సందర్భంగా అందజేశారు.