ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ పొందటం పాక్షిక విజయం
మార్చి నెలాఖరు నాటికి కొన్ని ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులు
అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ 27న జిల్లా ఎన్జీవో కార్యాలయాల వద్ద ఉద్యోగుల నిరసనలు
ఏపీ ఎన్జీజీవో జేఏసీ రాష్ట్ర చైర్మన్ బండి శ్రీనివాసరావు
విజయవాడ : గత రెండు వారాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దశల వారీగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వ పెద్దలను కలవర పాటుకు గురిచేయడంతో ఉద్యోగ సంఘాల నాయకులను మంత్రుల బృందం ఆహ్వానించిన చర్చలలో తమకు రావలసిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఈనెల 27న రాష్ట్ర జేఏసీ తలపెట్టిన “బి ఆర్ టి ఎస్ మహా ఆందోళన” కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రాష్ట్ర జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఎన్జీవో హోమ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు మధ్యంతర భృతి కోసం ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్ మేరకు ప్రభుత్వం స్పందిస్తూ ఉద్యోగులకు సత్వరమే 12వ పిఆర్సి ప్రయోజనాలు కల్పించేలా పి ఆర్ సి కమిషన్ వేగంగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మధ్యంతర భృతి ఇచ్చేందుకు నిరాకరించిందన్నారు. ఉద్యోగుల వైద్య ఖర్చుల నిమిత్తం ఆసుపత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో 70 కోట్ల రూపాయలు, సిపిఎస్ ఉద్యోగులకు టీఏ, డి ఏ ల నిమిత్తం చెల్లించాల్సిన మొత్తంలో 100 కోట్ల రూపాయలు వీలైనంత సత్వరంగా నిధులు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం స్పష్టం చేసినట్లు తెలిపారు. పెన్షనర్ల డిమాండ్లలో ప్రధానమైన క్వాంటం ఆఫ్ పెన్షన్ లో మార్పులు చేసేందుకు చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ఉన్న అవాంతరాలను అధిగమించి వారికి న్యాయం చేసేందుకు కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని తమకు ఇచ్చిన ఒప్పంద పత్రంలో పేర్కొన్నట్లు వివరించారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30% జీతం పెంపు కూడా తమ ఒప్పందంలో ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు కోరిన డిమాండ్లలో కొన్నింటిని సాధించుకున్నామన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం రాతపూర్వకంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డిమాండ్లను మార్చి నెలాఖరు నాటికి పూర్తిగా నెరవేరుస్తుందనే ఆశాభావంతో తమ ఆందోళన తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. 27వ తేదీన తలపెట్టిన మహా ఆందోళన కార్యక్రమానికి హాజరుకాకుండా ఉండేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉద్యోగ సంఘ నేతలను పోలీసులు అక్రమ కేసులు పెడతామని బెదిరించడాన్ని, కొంతమంది ఉద్యోగులను అదుపులోకి తీసుకోవదాన్ని రాష్ట్ర జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పోలీసులు కూడా తమకు మిత్రులేనని పేర్కొన్నారు. అయినప్పటికీ తమ ఉద్యోగులను బెదిరించడానికి నిరసనగా 27వ తేదీన రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో సంఘ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలుపుతారని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర జేఏసీ కార్యదర్శి కె.వి శివారెడ్డి, జేఏసీలోని వివిధ సంఘాలకు చెందిన పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.