న్యాయవాదులు దీనిపై దృష్టి సారించాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. నరసింహ సూచన
న్యాయవ్యవస్థపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు
న్యాయమూర్తులు తీర్పుల్లో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలి
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్
జిల్లా కోర్టు కాంప్లెక్స్ భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన న్యాయమూర్తులు
రూ.99.20 కోట్లతో కోర్టు భవనాల నిర్మాణం
విజయనగరం : వివాదాల పరిష్కారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించిన వారు సంవత్సరాల తరబడి న్యాయం కోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించేందుకు న్యాయవాదులు ప్రయత్నించాల్సి వుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం నరసింహ అన్నారు. మారుతున్న పరిస్థితుల్లో మనదేశం ప్రపంచ లీడర్‌గా రూపొందుతోందని, దీనిని దృష్టిలో వుంచుకొని న్యాయవ్యవస్థలోనూ మార్పులు రావలసి వుందన్నారు. న్యాయం కోసం సుదీర్ఘకాలం పాటు వేచిచూడాల్సిన పరిస్థితుల్లో మార్పు రావాలన్నారు. మధ్యవర్తిత్వంపై దృష్టిపెట్టి వివాదాల పరిష్కారంలో మెళకువలను న్యాయవాదులు తెలుసుకోవాలన్నారు. అన్నదమ్ముల మధ్య ఏర్పడిన ఆస్తి వివాదం పరిష్కారం కావాలన్నా, భార్యాభర్తల మధ్య స్పర్ధలు ఏర్పడితే వారు విడిపోవాలనుకున్నా అటువంటి సమస్యల పరిష్కారం కూడా 20 ఏళ్లు అవసరమా అనేది ఆలోచించాల్సి ఉందన్నారు. పాత జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించనున్న జిల్లా కోర్టు కాంప్లెక్స్ నూతన భవన సముదాయానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ ఆదివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో కలసి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కోర్టు నూతన భవనాల నిర్మాణానికి రూ.99.20 కోట్లను మంజూరు చేసింది. 6.58 ఎకరాల విస్తీర్ణంలో సెల్లార్ కాకుండా ఆరు అంతస్థుల్లో ఆధునిక వసతులతో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో యీ భవనాలను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ మాట్లాడుతూ కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువతీయువకులు జిల్లా కోర్టుల్లో తమ వృత్తిని ప్రారంభించేలా సీనియర్ న్యాయవాదులు వారిని ప్రోత్సహించాల్సి వుందన్నారు. విజయనగరంలో నూతన కోర్టు భవనాల ద్వారా మంచి వసతులు సమకూరనున్నాయని, వీటిని వినియోగించుకొని న్యాయవాదులు తమ వృత్తిలో సంతోషాన్ని పొందుతూ సమాజానికి సేవలు అందించాలన్నారు. ఈ ప్రాంతాన్ని గతంలో పరిపాలించిన వారు వేసిన విద్యా పునాదుల కారణంగా ఇక్కడి నుంచి ఎందరో కవులు, రచయితలు, విద్యావేత్తలు ఉద్భవించారని పేర్కొన్నారు.
తీర్పులు నిష్పక్షపాతంగా ఉండాలి : రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలు న్యాయవ్యవస్థపై ఎన్నో ఆశలు కలిగి ఉన్నారని, వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేలా న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా, స్వచ్ఛంగా, పారదర్శకంగా న్యాయవ్యవస్థను నిలపాల్సి వుందన్నారు. న్యాయస్థానంకు శంకుస్థాపన అంటే సాదాసీదా భవనానికి శంకుస్థాపన కాదని, న్యాయానికి ఒక కోవెల వంటిదని పేర్కొన్నారు. ఇక్కడ చేపడుతున్న కోర్టు భవనాల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని కోర్టుల్లో మౌళిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ.186 కోట్లు కేటాయించి ఇందులో తొలివిడతగా రూ.45 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటుగా రూ.30 అందజేసిందని, మొత్తం రూ.75 కోట్లలో రూ.50 కోట్ల మేరకు పాత పనులకు బిల్లులు చెల్లించామన్నారు. మిగిలిన రూ.20 కోట్లను మార్చి నెలాఖరులోగా ఖర్చు చేయాల్సి వుందన్నారు. విజయనగరం ప్రాంత చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా ఇక్కడి న్యాయస్థానాల భవనాలకు ఆకృతులను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక శ్రద్ధతో రూపొందించారని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు చెప్పారు. ఈ భవనాల నిర్మాణానికి నిధుల మంజూరుకోసం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం సహా పలువురు న్యాయమూర్తులు తోడ్పాటు అందించారని చెప్పారు.
రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరాం మాట్లాడుతూ ఈ భవనాల నిర్మాణం సకాలంలో పూర్తయ్యేలా పూర్తి సహకారం అందిస్తామన్నారు. జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా జడ్జి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి.ఎన్.తమ్మన్నశెట్టి, రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు గంటా రామారావు తదితరులు మాట్లాడారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దీపిక పాటిల్ మాట్లాడుతూ న్యాయాధికారుల సహకారంతో చిన్నపిల్లలపై అత్యాచారాలకు సంబంధించిన పోక్సో కేసులు త్వరితంగా పరిష్కరించి నిందితులకు శిక్ష పడేలా చేయగలుగుతున్నట్టు చెప్పారు. జిల్లా కోర్టు భవనాలను రెండేళ్ల వ్యవధిలో నిర్మాణం పూర్తిచేసేలా జిల్లా యంత్రాంగం ద్వారా సహకారం అందిస్తామని జిల్లాకలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు.ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ దంపతులను, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులను జిల్లా కోర్టు న్యాయవాదులు, న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, రోడ్లు భవనాలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ విజయరత్నం, ఇ.పి.డి.సి.ఎల్. ఎస్.ఇ. లక్ష్మణరావు, రోడ్లు భవనాలశాఖ ఇ.ఇ. వెంకటరమణ, డి.ఇ. శ్రీనివాస్, ఇ.పి.డి.సి.ఎల్. ఇ.ఇ. హరి తదితరులు పాల్గొన్నారు.