రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
సీబీఎస్ఈ పాఠ్యప్రణాళిక మాడ్యూళ్లు ఆవిష్కరణ
నిర్ధిష్ట అభ్యసన వైకల్యం కోసం ఛేంజ్ఇంక్ సంస్థతో ఒప్పందం
అమరావతి : రాష్ట్రంలోని 1000 ప్రభుత్వ పాఠశాలలల్లో సీబీఎస్ఈ అమలు అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సీబీఎస్ఈ పదో తరగతి పాఠ్య ప్రణాళిక మాడ్యూళ్లు (కరదీపికలు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం రూపొందించిన పాఠ్యప్రణాళికలు కలిగి ఉంటే బోధనలో నూతనత్వం సంతరించుకుంటుందన్నారు. ఈ పాఠ్య ప్రణాళికలు 2020 నాటి జాతీయ విద్యా విధానంని సమర్థవంతంగా అమలు చేయడానికి నిర్మాణాత్మక బోధనా సూత్రాల ఆధారంగా రూపొందించారని అన్నారు. జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ పాఠశాల విద్యలో వివరించిన పాఠ్య లక్ష్యాలు, సామర్థ్యాలు, అభ్యాసన ఫలితాలను ప్రతిబింబించేలా ఈ పాఠ్యప్రణాళికలు ఉన్నాయన్నారు. ఈ మాడ్యూళ్లను అభివృద్ధి చేయడానికి (సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్) సహకారమందించినందుకు ఆ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియెట్ కమీషనర్ సెక్రటరీ సౌరభ్ గౌర్ , సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ స్టేట్ లీడ్ ఉషాకుమారి, మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ మార్తాల వెంకటకృష్ణారెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్ పి.పార్వతి, సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి శ్రీనివాసులురెడ్డి, ఏపీఆర్ఈఐ సొసైటీ కార్యదర్శి నరసింహారావు, పదో తరగతి పరీక్షల విభాగం సంచాలకులు దేవానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిర్ధిష్ట అభ్యసన వైకల్యం కోసం ఛేంజ్ఇంక్ సంస్థతో ఒప్పందం : సహిత విద్యలో భాగంగా ఆర్పీడబ్ల్యూడీ (రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్)- 2016 ప్రకారం 21 రకాల వైకల్యాలను గుర్తించి ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పిల్లల్లో వైకల్యాలను గుర్తించడానికి కష్టతరమైన నిర్ధిష్ట అభ్యసన వైకల్యం (స్పెసిఫిక్ లెర్నింగ్ డిజిబిలిటీ) కోసం ‘ఛేంజ్ఇంక్’ సంస్థతో ఒప్పందం గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ శోభిక ఎస్.ఎస్, ‘ఛేంజ్ఇంక్’ సంస్థ ప్రతినిధి పూర్ణిత నంబియార్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. ఈ సంస్థ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజిబిలిటీ విద్యార్థులను అకడమిక్ పరంగా వారిని ముందుకు తీసుకెళ్లడం కోసం చేయాల్సిన విధానాలను రూపొందించడం, వారి కోసం కృషి చేయనున్నారు. ఈ సంస్థ స్వచ్ఛందంగా సేవలందించనుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.