రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పలువురికి ఘన సన్మానం
గుంటూరు : మాతృ బాష మాధుర్యాన్ని మరవద్దని రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. గుంటూరు జిల్లాలో ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎల్ వేణుగోపాల రెడ్డి సెమినార్ హాల్లొ బుధవారం తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి, సంచాలకులు వి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి రాజశేఖర్, విశిష్ట అతిథిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు పాల్గొన్న ఈ వేడుకల్లో వక్తలు తెలుగు భాషా సాంస్కృతం విశిష్టత గురించి గొప్పగా వివరించారు. ఆచార్య పి వర ప్రసాద మూర్తి సభాద్యక్షులుగా వ్యవహరించిన ఈ వేడుకల్లో కవులు రచయితలు, పండితులు, తెలుగు భాషను అందరూ మట్లాడాలని, పట్టు సాధించేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
పలువురికి ఘన సన్మానం : అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడకి చెందిన పలువురికి తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా తెలుగు భాష అభివృద్ధికి బాటలు వేసి విశిష్ట సేవలందించిన మొత్తం 18 మందిని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానించారు. వారిలో సీనియర్ జర్నలిస్టులు, రచయితలైన యేమినేని వెంకట రమణ, అన్నవరపు బ్రహ్మయ్య, ప్రముఖ నవలా రచయిత్రి, గేయ రచయిత్రి పుప్పాల సూర్యకుమారి, సామాజిక సేవకురాలు, రచయిత్రి సునీత లఖంరాజు, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రచనా రంగంలో లబ్ధ ప్రతిష్టులైన 18 మందికి పురస్కార ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఇటీవల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి ‘ డి లిట్ ‘ పట్టా పొందిన లక్ష్మీపార్వతికి ఘన సత్కారం జరిగింది. అలాగే ముఖ్య అతిథి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య పి రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి కరుణ, సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు, అకాడమీ సంచాలకులు వి రామకృష్ణ, తెలుగు జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ అనిత తదితరులు పాల్గొన్నారు