కర్నూలు ఈనాడు కార్యాలయం పై దాడికి ఏపీయూడబ్ల్యూజే నిరసన
విజయవాడ : జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడి పత్రికా స్వేచ్ఛను హరించాలనే ఆలోచన ఉన్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్( ఏపీయూడబ్ల్యూజే ) నాయకులు హెచ్చరించారు. రాప్తాడు ఫోటో జర్నలిస్ట్ పై పాశవిక దాడికి పాల్పడిన, కర్నూలులో ఈనాడు కార్యాలయం పై రాళ్ల దాడికి ఒడిగట్టిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద బుధవారం ఉదయం ఏపీయూడబ్ల్యూజే అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనాడు కార్యాలయం పై దాడులను ఖండిస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు, జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై ఇదే తరహాలో దాడులను కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ రెండు సంఘటనల్లో నిందితులను గుర్తించి తక్షణమే కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ సీనియర్ నాయకుడు ఎస్కే బాబు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు చేసే సంస్కృతి ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాని కాపాడాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్య వాదులందరిపై ఉందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అర్బన్ అధ్యక్షుడు చావా రవి, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి డి. నాగరాజు, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయభాస్కర్, ఉపాధ్యక్షుడు సాంబశివరావు, నారాయణ, సామ్నా నగర అధ్యక్షుడు ఎం వి సుబ్బారావు తదితరులు హాజరయ్యారు.