సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి
ఫార్మాకోథెరపీటిక్స్, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభం
విజయవాడ : ఆధునిక యుగంలో ఫార్మసీ విద్యను అందించే అధ్యాపకులు నిరంతరం తమ పరిజ్ణానాన్ని అభివృద్ది పరుచుకోవటం తప్పనిసరని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. రాష్ట్రంలోని ఫార్మసీ అధ్యాపకుల శిక్షణ అవసరాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ సహకారంతో చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నేతృత్వంలో ఫార్మాకోథెరపీటిక్స్, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ పేరిట ఏర్పాటు చేసిన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను మంగళవారం సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 24 వరకు జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల ద్వారా ఫార్మసీ సిబ్బందికి నైపుణ్యత, పరిజ్ఞానాన్ని పెంపొందించమే లక్ష్యంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా నాగరాణి స్పష్టం చేసారు. పాలిటెక్నిక్ ఫ్యాకల్టీల వృత్తిపరమైన అభివృద్ధి ప్రాముఖ్యతను అనుసరించి ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నామన్నారు. మరోవైపు రాష్ట్రంలోని డి.ఫార్మసీ విద్యార్థుల కోసం నూతనంగా రూపొందించిన సిలబస్ పుస్తకాలను నాగరాణి ఆవిష్కరించారు. ఫార్మసీ కౌన్సిల్ ఆప్ ఇండియా అనుమతితో ఫార్మసీ సబ్జెక్ట్ నిపుణులు, ఫార్మసీ కౌన్సిల్ నిపుణుల సంప్రదింపుల మేరకు సవివరమైన సిలబస్‌తో కూడిన ఈ పుస్తకాలను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ రూపొందించింది. సిలబస్ పుస్తకాలు ఎన్బిఎ అక్రిడిటేషన్ కు సిద్ధమయ్యేలా మార్గదర్శకంగా రూపొందించారు. కార్యక్రమంలో బోర్డు అధికారులు రమణ బాబు, జివివిఎస్ మూర్తి, సుబ్బారెడ్డి, ప్రసాద్ బాబు, ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ విలియం కేరీ, సెంటర్ ఫర్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ నుండి డాక్టర్ జకులిన్ దివ్య మేరీ తదితరులు పాల్గొన్నారు.