కాకినాడ పార్లమెంటు రౌండప్
కాకినాడ పార్లమెంటులో హేమాహేమీల కొలువు
తండ్రి,తనయులు కేంద్ర మంత్రులు
ముగ్గురు మూడేసి సార్లు గెలిచారు
కాపుల నియోజవర్గంగా గుర్తింపు
కాకినాడ : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో హేమాహేమీలు కొలువు తీరారు. పార్లమెంటులో సత్తా చాటారు. ఈ నియోజకవర్గానికి అనేక విశేషాలు ఉన్నాయి. మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ నుంచి ఏకంగా ముగ్గురు మూడుసార్లు చొప్పున విజయం సాధించారు. ఇలా మూడుసార్లు విజయం సాధించిన వారిలో తండ్రి కొడుకులు ఉండటం విశేషం.ఎం.ఎస్ సంజీవరావు వరుసగా మూడు సార్లు అంటే 1971, 1977 సంవత్సరాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 1980లో కాంగ్రెస్-ఐ నుంచి గెలిచారు. అలాగే ఆయన కుమారుడు పల్లంరాజు 1989, 2004, 2009 సంవత్సరాల్లో కాంగ్రెస్-ఐ పార్టీ నుంచి విజయ సాధించారు. అంతేకాదు సంజీవరావు తండ్రి మల్లిపూడి పల్లంరాజు 1955లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. మొత్తం మూడు తరాల రాజకీయ చరిత్ర వారిది. ముసలగంటి తిరుమలరావు 1957,62,67 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు.
1957 లో దిసభ్య నియోజకవర్గంలో దళిత నాయుడు బయ్యా సూర్యనారాయణ మూర్తి గెలిచారు.ఈయనకు అరుదైన రికార్డు ఉంది. ఎందుకంటే 1952లో ఏలూరు పార్లమెంట్ నుంచి కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుంచి గెలుపొందారు. 1962లో అమలాపురం పార్లమెంట్ ఏర్పడడం అది ఎస్సీలకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి 1962,1967,1971 ఎన్నికలలో విజయం సాధించారు. అంటే ఈయన 1952 నుంచి వరుసగా ఐదు సార్లు పార్లమెంటు కు వెళ్లారు. ఎలా ఐదు సార్లు వరుసగా వెళ్లి ఎంపీగా గెలిచిన నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ లోనే లేక లేకపోవడం విశేషం. 1991లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన తోట సుబ్బారావు అప్పటి ప్రధాని పి.వి నరసింహారావు నాయకత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏ పార్టీ ఎప్పుడు గెలిచిందంటే….
ఈ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆరుగురు గెలుపొందగా కాంగ్రెస్-ఐ నుంచి నలుగురు, తెలుగుదేశం నుంచి ఐదుగురు, సీపీఐ, బిజెపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. చెలమలశెట్టి సునీల్ 2009లో పిఆర్పి నుంచి, 2014లో వైఎస్ఆర్ పార్టీ నుంచి, 2019లో టిడిపి నుంచి వరుసగా పోటీ చేసి అదృష్టం కలసి రాక ఓటమి చెందారు.1971లో ఎం ఎస్ సంజీవరావు రికార్డ్ స్థాయిలో 2,92,926 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో టిడిపి నుంచి పోటీ చేసిన తోట నరసింహం 3,431 మెజార్టీతో గెలిపించారు. ఇదే అత్యల్ప మెజార్టీ.
కాపుల నియోజకవర్గంగా గుర్తింపు..
కాకినాడ పార్లమెంట్ అంటే కాపులు నియోజవర్గంగా ఎంతో కాలం నుంచి గుర్తింపు పొందింది.ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి.1971 నుంచి ఇప్పటి వరకూ కాపులకే అవకాశం వచ్చింది.1998లో ఎడాది పాటు కృష్ణంరాజు ఎంపీగా ఉన్నారు. చెలికాని వెంకట రామరావు వెలమ సామాజ వర్గం కాగా ముసలిగంటి తిరుమలరావు బ్రాహ్మణ సామాజిక వర్గం. అలాగే రెబల్ స్టార్ యు.వి. కృష్ణంరాజు క్షత్రియ సమాజానికి కాగా మిగిలిన వారంతా కాపు సామాజిక వర్గం వారే ఈ పార్లమెంట్ నుంచి గెలుపొందుతూ వచ్చారు.
కాకినాడ ఎంపీలుగా గెలిచింది వీరే…
2019..వంగా గీత (వైసిపి)
2014 ..తోట నరసింహం (టిడిపి)
2009 మల్లిపూడి పల్లంరాజు (కాంగ్రెస్-ఐ)
2004 మల్లిపూడి పల్లంరాజు (కాంగ్రెస్-ఐ)
1999..ముద్రగడ పద్మనాభం (టిడిపి)
1998..యు వి కృష్ణంరాజు (బిజెపి)
1996…తోట గోపాలకృష్ణ (టిడిపి)
1991..తోట సుబ్బారావు (టిడిపి)
1989…మల్లిపూడి పల్లంరాజు (కాంగ్రెస్-ఐ)
1984.. తోట గోపాలకృష్ణ (టిడిపి)
1980.. ఎం.ఎస్ సంజీవరావు (కాంగ్రెస్-ఐ)
1977..ఎం.ఎస్ సంజీవరావు (కాంగ్రెస్)
1971.. ఎం.ఎస్ సంజీవరావు (కాంగ్రెస్)
1967..మొసలకంటి తిరుమలరావు(కాంగ్రెస్)
1962..మొసలికంటి తిరుమలరావు(కాంగ్రెస్)
1957.. మొసలకంటి తిరుమలరావు(కాంగ్రెస్) ద్విసభ్య.. భయ్యా సూర్యనారాయణ మూర్తి(కాంగ్రెస్)
1952… చెలికాని వెంకట రామారావు (సిపిఐ)