పద్మ భూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్
అమరావతి : జాతీయ స్దాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు మార్గం చూపిన తెలుగుదేశం వ్యవస్దాపకులు, తెలుగు ప్రజల ఆరాధ్య కధా నాయకుడు నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇచ్చేందుకు ప్రధాని చొరవ చూపాలని పద్మ భూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ పేర్కొన్నారు. భరతమాత ముద్దు బిడ్డలు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్‌లకు మరణానంతరం “భారత రత్న” ప్రదానం చేసిన నేపధ్యంలో, డాక్టర్ ఎన్.టి.రామారావును కూడా అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించాలని యార్లగడ్డ మరోసారి విన్నవించారు. ప్రస్తుతం విదేశాలలో ఉన్న ఆయన ఈ మేరకు ఫ్రధానికి లేఖ రాసారు. నటుడిగా, ముఖ్యమంత్రిగా డాక్టర్ ఎన్టీఆర్ భారతీయ సంస్కృతి పరిరక్షణలో కీలక భూమిక పోషించారన్నారు. సంక్షేమ రాజ్యం, పరిపాలనా సంస్కరణలు, మహిళా సాధికారత, జాతీయ రాజకీయాలు, ప్రజా జీవితం తదితర విభిన్న అంశాలలో ఎన్టీఆర్ చేసిన కృషి అజరామరమన్నారు. దివంగత ఎన్.టి. రామారావు 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా దేశంలో ‘ప్రత్యామ్నాయ రాజకీయాలకు’ పెద్దపీట వేశారన్నారు. 1989లో కేంద్రంలో రెండవ కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నందమూరి ప్రధాన పాత్ర పోషించారని, దివంగత ఎన్టీఆర్ నటుడిగా అనేక పౌరాణిక పాత్రలు ధరించి తెలుగు ప్రజలతో పాటు భారత దేశ ప్రజల మనస్సులలో తనకంటూ ఒక శాశ్వత స్థానాన్ని పొందారన్నారు. ఈ ప్రక్రియలో ప్రాచీన భారతీయ ఆలోచన, తత్వశాస్త్రం, సంస్కృతి యొక్క సద్గుణాలను ఎన్టీఆర్ హైలైట్ చేశారన్నారు. నటుడు, రాజకీయ నాయకుడు స్వర్గీయ ఎంజి రామచంద్రన్‌ను 35 సంవత్సరాల క్రితం ‘భారతరత్న’తో సత్కరించారని, అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని, స్వర్గీయ ఎన్.టి.రామారావుకు ‘భారతరత్న’ ప్రదానం చేయాలని యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ప్రధానికి ఒక లేఖ ద్వారా విన్నవించారు.