నివాసం, వ్యాపారం పక్క రాష్ట్రంలో..అధికారం మాత్రం ఇక్కడ కావాలా బాబూ?
చంద్రబాబు, లోకేష్ లను జనం పట్టించుకోరు…వాళ్ళు ప్రజల్లో లేరు
జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేసింది నిజం కాదా లోకేష్?
ప్రతిపక్షాలకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు హితవు
శ్రీకాకుళం : రాష్ట్రంలో అభివృద్ధి చూసి ప్రతిపక్ష నేతలు మాట్లాడాలంటూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హితవు పలికారు. ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లని, కళ్లు ఉన్నా చూడలేని వాళ్లని, చెవులు ఉండి వినలేని వాళ్లని, నిద్ర నటించే వాళ్లను ఏం అనగలం అంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం శ్రీ పురం(సానివాడ) పంచాయతీలో రూ. 80 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్‌ను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం మాట్లాడుతున్న విపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌లో (పక్క రాష్ట్రంలో) ఉంటున్నారు. ఆయన వ్యాపారాలన్నీ పక్క రాష్ట్రంలో ఉంటే అదనంగా ఇక్కడ సీఎం పదవి కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఇవాళ మన రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి అంట! టీడీపీ యువ నాయకుడు లోకేష్ చెబుతున్నారు. పథకాల అమలులో భాగంగా గ్రామాల్లో ఏనాడైనా వర్గాలు చూశామా ? పార్టీ చూశామా ? ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులా? కాదా ? అన్నదే చూశాం. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఎందుకు ఈ మాట చెప్పలేకపోయారు. చెప్పు లోకేష్?’’ అని మంత్రి ధర్మాన నిలదీశారు.
గత టీడీపీ హయాంలో జన్మభూమి కార్యకర్తలు దోచుకున్నారు. పథకాల వర్తింపు కోసం ప్రజలు అర్జీలు పెట్టుకుంటే కలెక్టర్లు సైతం జన్మ భూమి కమిటీ సభ్యులను కలవమని చెప్పేవాళ్లు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఓటు వేసి అధికారంలోకి వచ్చి చంద్రబాబు చేసిన పని ఏముందని? ఇవాళ వివక్ష, కక్ష సాధింపు ఉన్నాయని అంటున్నారు లోకేష్. గ్రామాలకు వచ్చి చూస్తే తెలుస్తుంది వాస్తవాలేంటన్నది. ప్రజలకు లోకేష్, చంద్రబాబు ఎప్పుడో దూరం అయిపోయారన్నారు. విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందని అంటున్నారు. ఇవాళ విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చి, ఇంటర్నేషనల్ సిలబస్ తీసుకు వచ్చి పాఠాలు చెప్పిస్తున్నాం. కానీ వాస్తవాలు గుర్తించకుండా ఆ ఇద్దరూ (చంద్రబాబు, లోకేష్) అబద్ధాలు, అన్యాయాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. కొంతమంది సినీ యాక్టర్లు వస్తుంటారన్నారు. వాళ్లంతా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటారు. వాళ్లే వలంటీర్లు వద్దని అంటున్నారు. వలంటీర్లు ప్రజలకు చేస్తున్న సేవ ఏంటన్నది పక్క రాష్ట్రంలో ఉన్నవారికి ఏం అర్థం అవుతుంది? ఈ రోజు ఇంతమంది సంతోషంగా ఉంటున్నారంటే దానికి కారణం జగన్ ప్రభుత్వం కాదా..అందరి క్షేమం కోరుకున్నది,అందుకు తగ్గ విధంగా పాలన చేస్తున్నది జగన్ ప్రభుత్వం కాదా.. టీవీలలో, పత్రికల్లో ఈ ప్రభుత్వంపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను అందరూ తిప్పి కొట్టాలి. మాట్లాడితే చాలు జగన్ డబ్బులు పంచేస్తున్నారు..పంచేస్తున్నారు..అంటున్నారే కానీ ఆయనను ఉద్దేశించి..తినేస్తున్నారు..తినేస్తున్నారని అనడం లేదు ఎందుకు..? అన్నారు.
ఈ ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు శ్రీకాకుళం జిల్లాలో చేపట్టాం. చంద్రబాబు ఇంతకు ముందు ఐదేళ్లలో ఏం చేశారో చెప్పగలరా.? కిడ్నీ బాధితుల కోసం 200 కోట్ల రూపాయలతో డయాలసిస్ సెంటర్‌ను పలాసలో నిర్మించాం. ఉద్దాన ప్రాంతానికి రక్షిత మంచి నీటి పథకం 700 కోట్ల రూపాయలతో అందించాం. అలానే 4 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న మూలపేట పోర్టు నిర్మాణపు పనులను త్వరలో పూర్తి చేస్తాం. బుడగుట్ల పాలెంలో 350 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం దిద్దాం. ఇవన్నీ ఐదేళ్లలో మేం చేశాం. విపక్ష నేత చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ వారి హయాంలో ఏం చేశారో చెప్పగలరా.? అని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. 2.5 లక్షల శాశ్వత ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చాం. 56 వేల ఉద్యోగాలను వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేశాం. వీటి విషయమై ఎవరైనా, ఎక్కడైనా లంచం ఇచ్చారా? పథకాల అమలు కోసం లేదా ఇతర అభివృద్ధి పనుల కోసం అప్పులు చేస్తున్నాం అంటున్నారు. గత ప్రభుత్వం కన్నా తక్కువ అప్పులు చేశాం. వారు దోచుకు తింటే ఈ ప్రభుత్వం హయాంలో ప్రజల ఖాతాల్లోకి నగదు వేసి ఆ కుటుంబం బాగుండాలని భావించాం. గత పాలకులు రాష్ట్ర ఖజానాను లూటీ చేశారు.
వంశధార ప్రాజెక్ట్ కోసం ఒడిశాతో ఉన్న వివాదం నేపథ్యంలో పరిష్కారం కోసం సీఎం జగన్ చొరవ చూపారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కలిశారు. నేరడి బ్యారేజీ విషయమై చర్చలు చేపట్టారు. అయిన కూడా ఆ వివాదం ఓ కొలిక్కి రాకపోవడంతో గొట్టా దగ్గర లిఫ్ట్ పెట్టి ప్రాజెక్ట్‌ను నింపబోతున్నాం. 185 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో పూర్తి అవుతాయి. ఇదంతా సీఎం జగన్ చేసిన కృషి కాదా..? ఇది కాదా అభివృద్ధి..? అని నేను మిమ్మల్నిఅడుగుతున్నా. కొంత మంది కళ్లు ఉన్నా చూడలేని, చెవులు ఉండి వినలేని వాళ్ళు, నిద్ర నటించే వాళ్లను ఏం అనగలమని అన్నారు. గతంలో పండే పంట అమ్ముకోవాలంటే ఎవరో వ్యాపారి కోసం వేచి ఉండాలి. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం ఏర్పాటుతో అక్కడే పంట కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకున్నాం. ఇంకా రైతులకు చేరువగా ఉండే విధంగా ఆర్బీకేలు ఏర్పాటు చేసి, వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించాం. రైతులు, అన్ని వర్గాల మేలు కోరి సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ఎప్పటికప్పుడు ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ పని చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.