అనారోగ్య సమస్యలకు కారణాలపై అన్వేషణ
ట్యాంకర్లతో నీటి సరఫరాపై మందస్తు సమాచారం అవసరం
మంచినీటి వినియోగం విషయంలో అవగాహన కల్పించండి
ఇంటింటి సర్వే లో అన్ని వివరాలు నమోదు చేయండి
కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పనిచేయాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
డయేరియా అనుమానిత కేసులకు సంబంధించి అధికారులతో సమీక్ష
గుంటూరు : గుంటూరు నగరంలో పలువురు అస్వస్థతకు గురవడానికి సంబంధించి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అధికారులంతా అప్రతమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ గుంటూరు జీజీహెచ్‌లో పలు కేసులు నమోదువుతున్న నేపథ్యంలో మంత్రి విడదల రజిని ఆదివారం కలెక్టర్‌తోపాటు, ఆయా విభాగాల ముఖ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ అనారోగ్య సమస్యలకు సంబంధించిన కారణాలపై అన్వేషణ కొనసాగుతున్నదని చెప్పారు. ఇప్పటికే ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించామని తెలిపారు. ఆ కమిటీ అన్ని వివరాలను సూక్ష్మస్థాయిలో తెలుసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పనిచేయాలని చెప్పారు. అస్వస్థత కేసులు నమోదవుతున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి అందజేస్తున్న విషయంపై స్థానికులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. ఇంటింటి సర్వే పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండరాదని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యలుంటే 8341396104 నం.కు ఫోన్ చేయొచ్చన్నారు.
సమీక్ష సమావేశం అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలోనే మంత్రి విడదల రజిని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాంతులు, విరేచినాలతో బాధపడేవారు ఎవరైనా సరే 8341396104 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు. 24 గంటలూ ఈ నంబరు అందుబాటులో ఉంటుందన్నారు. హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేయడం ద్వారా వైద్యం పొందే విషయంలో తగిన సహాయసహకారాలు అందుతాయని వెల్లడించారు. అనుమానిత ప్రాంతాల్లో మంచినీటి శాంపిళ్లను తీసుకున్నామని తెలిపారు. వాటిని పరీక్షలకు పంపామన్నారు. నగరంలో ఒకేచోట నుంచి ఈ కేసులు రావడం లేదని చెప్పారు. ఉదయం నుంచి పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. కొత్తకేసులు నమోదుకావడం లేదన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. బాధితులకు అత్యున్నత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. నగరంలోని అన్ని యూపీహెచ్‌సీల్లో 24 గంటలపాటు మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సోమవారం కూడా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కలెక్టరేట్లో మరో సారి రివ్యూ నిర్వహిస్తామన్నారు. పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేవరకు అత్యవసర స్థితి కొనసాగుతుందని వెల్లడించారు.
రాజకీయాలు మానుకోండి : శవరాజకీయాలు మానుకుంటే మంచిదని ప్రతిపక్ష పార్టీలకు మంత్రి విడదల రజిని సూచించారు. డయేరియా అంటూ విష ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. పరీక్షల్లో నిర్ధారణ కాకుండానే, నివేదికలు పూర్తిస్థాయిలో అందకుండానే డయేరియా అని ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 2018లో గుంటూరు నగరాన్ని డయేరియా వణికించిందని చెప్పారు. ఏకంగా 10 ప్రాంతాల్లో డయేరియా విజృంభించిందని గుర్తుచేశారు. అప్పట్లో 24 మంది చనిపోయారని, ఏకంగా 2400 మంది డయేరియా బారిన పడ్డారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అంటే అదని, అంతమంది చనిపోతున్నా అప్పట్లోటీడీపీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రోడ్లు ఇష్టానుసారం తవ్వేసి, మురుగుకాలువలు, మంచినీటిపైపులైన్లను ఏకంగా చేసిన పాపం ఫలితంగానే అప్పట్లో అంతమంది చనిపోయారని, వేలాదిమంది అస్వస్థతకుగురయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పుడు తమ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తున్నా బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తచేశారు. లేని సమస్యను ఉన్నట్లుగా చూపి, లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయన్నారు. ఇలాంటివారికి ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశం, విలేకరుల సమావేశాల్లో కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, మేయర్ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి, డీఎంఅండ్‌హెచ్‌వో విజయలక్ష్మి, ఆర్డీ శోభారాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.