ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది సంస్ధ డైరెక్టర్ జనరల్ ఆర్ పి సిసోడియా
అశేష జీడి రైతుల సమాఖ్య తరఫున సిసోడియాకు “మన్య దీపధారి” పురస్కారం
జీడీ పంటల ద్వారా అభివృద్ధి సాధించిన రైతులకు “ఆర్పి జీడి రత్న” అవార్డులు
అమరావతి : నిజాయితీగా పని చేసినప్పుడు చాలా అవాంతరాలు ఏర్పడతాయని వాటిని అధికమించి ముందడుగు వేసిన వారు కార్య సాధకులు అవుతారని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది సంస్ధ డైరెక్టర్ జనరల్ ఆర్ పి సిసోడియా తెలపారు. గిరిజనుల జీవితాల్లో మెరుగులు దిద్దేందుకు 30 సంవత్సరాల క్రితం తాను చేసిన కృషి ఇప్పుడు ఫలితాలను ఇస్తుండటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. 1994-1996 మధ్య కాలంలో సిసోడియా పార్వతీపురంలో ఐటిడిఎ పిఓగా పనిచేసిన సందర్భంలో తొలిసారి ఇక్కడ గిరిజనులకు అసరా కలిగించేలా జీడితోటల పెంపకానికి అంకురార్పణ చేసారు. అది వారి జీవితాలలలో పెనుమార్పుకు కారణమైంది. పార్వతీపురం తోటపల్లి జట్టు ట్రస్టులో వ్యవస్థాపకులు డా. డి. పారినాయుడు ఆధ్వర్యంలో శనివారం “సుస్థిర జీడి తోటలో అంతర పంటలు -మహిళా సంఘాలతో సమన్వయంపై అవగాహనపై జరిగిన సదస్సు”కు సిసోడియా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో జీడి తోటల సాఫల్యతను నిపుణులు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జట్టు ట్రస్ట్ సౌజన్యంతో అశేష జీడి రైతుల సమాఖ్య తరఫున సిసోడియాకు “మన్య దీపధారి” అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా సిసోడియా తాను అంకితం తీసుకున్న “ప్రకృతి వ్యవసాయంలో జీడి సాగు విధి విధానాలు” పుస్తకాన్ని ఆవిష్కరించారు. జీడీ పంటల ద్వారా అభివృద్ధి చెందిన పలువురు రైతులకు “ఆర్పి జీడి రత్న” అవార్డులను బహుకరించారు. ఈ సందర్భంగా సిసోడియా గతంలో తాను మన్యం జిల్లాలో ఐటీడీఏ పిఓగా పనిచేసినప్పుడు పార్వతీపురంలో నెలకొన్న పరిస్ధితులను నెమరు వేసుకున్నారు. భవిష్యత్తులో అవకాశం లభిస్తే ఈ ప్రాంత అభివృద్దికి మరింత సహకారం అందిస్తామన్నారు. సిసోడియా రాక నేపధ్యంలో గిరిజనులు తండోపతండాలుగా తరలివచ్చారు. జీడి మామిడి తోటలకు అంకురార్పణ చేసి గిరిజనుల జీవితాలలో ఆర్ధిక స్వావలంబన సమకూరేలా సిసోడియా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. నాటి కృషి ఫలితాలను నేడు గిరిజననులు అందుకుంటున్నారు. నాబార్డు డిడిఎంటీ నాగార్జున మాట్లాడుతూ నిజాయితీగా పనిచేసే వారికి ప్రజల గుండెల్లో స్థానం ఉంటుందని, వారిని ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని ఈరోజు హాజరైన జన సందోహం దానికి నిదర్శనమే అన్నారు.
డిపిఎం షణ్ముఖరావు మాట్లాడుతూ మూడు దశాబ్ధాల నాటి ఒక ప్రారంభం, నేడు లక్షలాది ఎకరాలకు విస్తరించిందన్నారు. జర్నలిస్ట్ కొండలరావు జీడీ పంట గిరిజనుల గుండె కాయని, గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి జీడితోటలు ఉపకరించాయని అన్నారు. ప్రముఖ రచయిత రౌతు వాసుదేవరావు మాట్లాడుతూ జీడి తోటల పెంపకంతో పాటు అక్షరాస్యత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత సిసోడియాదే అన్నారు. మాజీ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠం మాట్లాడుతూ జీడి ప్రాసెసింగ్ సౌకర్యాల ఏర్పాటుతో మరింత లబ్ధి చేకూరగలదన్నారు. ఆర్ వైఎస్ఎస్ కన్సల్టెంట్ రమాప్రభ మాట్లాడుతూ సిసోడియా వంటి అంకితభావం గల అధికారితో పనిచేయడం అదృష్టమని చెప్పారు. జట్టు ట్రస్ట్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ సరోజ్ ప్రహరాజ్, సినీ గేయ రచయిత, బడి నుండి పొలం బడికి కన్సల్టెంట్ శివాజీ, రచయితలు, సామాజిక వేత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, గిరిజనులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిధులు అందరూ సిసోడియా సేవలను ఎంతగానో ప్రశంసించారు.