పొత్తుల హడావుడితో కంగారుగా ఢిల్లీకి సీఎం
ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ కానున్న ముఖ్యమంత్రి
ఇండియా టుడే సర్వేతో అధికార పార్టీ లో గుబులు
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తో అధికార పార్టీ లో అలజడి మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగియగానే జగన్ మోహన్ రెడ్డి హస్తిన బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ప్రతిపక్ష టీడీపీ తో జత కట్టనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన చర్చనీయాంశంగా మారింది. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ హవా వున్నట్లు గురువారం ఇండియా టుడే సర్వే లో తేలడంతో వైసీపీలో గుబులు పుట్టిస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు సీఎం జగన్. ఈ రాత్రి 1, జన్‌పథ్ నివాసంలో ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు. అపాయింట్మెంట్ షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం నిధులు త్వరితగతిన విడుదలకు ఆదేశాలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు సంబంధించిన ఆమోదం,
కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్న అంశాలతో పాటు పెండింగ్ అంశాల పరిశీలన, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్
కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు, జాతీయ ఆహార భద్రతాచట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు మరింత ఎక్కువ కవరేజీ, ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు సమానంగా వాటా
ఈ వాటా లభిస్తే రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం
విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు, కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం, ఏపీఎండీసీ కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు, ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.