విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు పాలకమండలి ఏర్పాటై సంవత్సరం గడుస్తున్న సందర్బంగా బుధవారం చైర్మన్ ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు కొండ దిగువ మెట్ల పూజతో ప్రారంభమై కొండపైకి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం చైర్మన్ ఛాంబర్ నందు సంవత్సర కాలం నుండి భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పలు కార్యక్రమాల గురించి తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు ధర్మకర్తల మండలి చైర్మన్ గా, సభ్యులుగా ఎన్నికవడం ఎన్నో జన్మల అదృష్టముగా అందరం భావిస్తున్నామని తెలిపారు. దేవస్థానం నందు రాత్రి పూట భోజనం ఏర్పాటు చేశామని వివరించారు. అమ్మవారి దర్శనానంతరం భక్తులకు కుంకుమ ప్రసాదం వితరణ, పాదుకలు, శటగోపం, నూతన వధువు వరులకు ఉచితముగా అంతరాలయ దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులకు దుర్గా ఘాట్ నందు కృష్ణ నదిలో పూర్తి స్థాయిలో గతంలో వలే నదీ స్నానములకు అనుమతింపజేయడం జరిగిదని అన్నారు. పొంగలి షెడ్డు నిర్మాణం, పొంగలి తయారీ కొరకు స్టవ్, ఇతర సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఉచిత బస్సులు కొండపై నుండి దుర్గా ఘాట్ వరకు, దుర్గా ఘాట్ నుండి కొండపైకి, దివ్యాంగులకు వీల్ చైర్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. అమ్మవారి భక్తుల రద్దీ దృష్ట్యా భవిష్యత్ కు అనుగుణముగా అన్నదాన భవనం నిర్మాణం, ప్రసాదం పోటు నిర్మాణం, ఎలివేటేడ్ క్యు కాంప్లెక్స్ నిర్మాణ పనులు, రాతి యాగశాల నిర్మాణ పనుల శంకుస్థాపన పనులు జరుగుతున్నాయని, పలు కార్యక్రమాలు ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం నిర్వహించడం జరుగుతోందని చైర్మన్ తెలిపారు.