న్యూఢిల్లీ : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడుతూ తనపై అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడటం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది భారత ప్రధాన మంత్రి. ఆ హామీని అమలు చేయనందుకు ప్రధాని నరేంద్ర మోడీని విజయ సాయిరెడ్డి ప్రశ్నించడం లేదు. 2019 నుంచి దాదాపు అన్ని బిల్లులు జగన్ మద్దతుతోనే ఆమోదం పొందాయి. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విపక్షాలన్నీ బహిష్కరిస్తే ఆయన మాత్రం హాజరయ్యారు. అన్ని ప్రజా వ్యతిరేక బిల్లుల ఆమోదానికి మద్దతుగా నిలిచారు. ప్రత్యేక హోదా సాధనకు 15 సార్లు అవకాశం వచ్చినా వైసీపీ చేజార్చుకుంది. సభలో బిల్లులకు మద్దతు ఇస్తారు. బయటికి వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతారు. జగన్ బీజేపీ కి ఏటీఎంలా మారారు. వీటన్నింటికి కారణం విజయసాయిరెడ్డి. కేంద్రానికి వైకాపా మద్దతుగా నిలవడం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. వారిద్దరి వ్యక్తిగత అవసరాలు, సీబీఐ కేసుల కోసం మాత్రమే బీజేపీకి లొంగిపోయారని మాణికం ఠాగూర్ విమర్శించారు.