1-19 వయసు పిల్లలు , కిషోర బాలబాలికలకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ
జిల్లాల్లో 1.32 కోట్ల అల్బెండజోల్ 400 ఎం.జి మాత్రలు సిద్ధం
55608 అంగన్వాడీ కేంద్రాలు , 33666 ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు, 3307 జూనియర్ కాలేజీలలో మాత్రల పంపిణీ
ఎంపీడీవోల కార్యాలయాల్లో ఈనెల 7న అందుబాటులో అల్బెండజోల్ మాత్రలు
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలు ఎంపిడివోల నుండి మాత్రలు తీసుకునేలా ఏర్పాట్లు
పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ జరిగేలా వినూత్నంగా కార్యక్రమం నిర్వహణ
జిల్లా కలెక్టర్లతో డిఎంహెచ్వోలు సమన్వయం చేసుకోవాలి
తమ పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు
అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలు విద్యా సంస్థలలో ఈ నెల 9న జాతీయ నులి పురుగుల నిర్మూలనా దినం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధంగా ఉందని ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ, విద్యా సంస్థలలో చదువుకుంటున్న 1-19 సంవత్సరాల మధ్య వయస్కులైన పిల్లలు , కిషోర బాలబాలికలకు అల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల మాత్రల్ని ఉచితంగా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని ఆయన పేర్కొన్నారు. జిల్లాల్లో 1.32 కోట్ల అల్బెండజోల్ 400 ఎం.జి మాత్రలు సిద్ధంగా ఉంచామన్నారు. 55608 అంగన్వాడీ కేంద్రాలు , 33666 ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు, 3307 జూనియర్ కాలేజీలలో మాత్రల్ని పంపిణీ చేస్తారని తెలిపారు. ఎంపీడీవోల ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల దినం నిర్వహణకు అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు. జిల్లా కలెక్టర్లతో డిఎంహెచ్వోలు సమన్వయం చేసుకోవాలని, రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. తమ పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణ బాబు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న పిల్లల సంఖ్య 34 శాతం మేర వుందని అంచనా వేశామన్నారు. పొట్టలో నులిపురుగుల కారణంగా పోషకాల జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగి శారీరక, మానసిక లోపాలకు, రక్తహీనతకు దారితీస్తుందని తద్వారా పిల్లల్లో చురుకుదనం లోపించి నీరసపడి పోతారన్నారు. పర్యవసానంగా చదువు సంధ్యల్లోనూ వెనుకబడిపోతారన్నారు.ఈ సమస్యతో బాధపడే పిల్లలు తరచు అనారోగ్యంగా, అసలటగా వుంటూ, ఏకాగ్రత కోల్పోతారని, పాఠశాలకు తరచు గైర్హాజరవుతుంటారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి పిల్లలకు అల్బెండజోల్ తో చికిత్స సురక్షితమైన, తక్కువ ఖర్చు తో కూడిన వైద్య పరిష్కారంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2016 లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 9న ఈ కార్యక్రమంతో పాటు ఫిబ్రవరి 16వ తేదీన తిరిగి మాప్అప్ దినాన్ని కూడా అమలు చేస్తోంది. రాష్ట్రంలో 1-19 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలు, కిషోర బాలబాలిలు 1.32 కోట్ల మంది వున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 55,608 అంగన్వాడీ కేంద్రాలు, 33,666 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇంకా 3,307 జూనియర్ కళాశాలల్లో ఈ నులిపురుగుల నిర్మూలనా దినం కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది. అల్బెండజోల్ మాత్రల్ని అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తమ సంస్థలో్లని పిల్లలకు అందజేస్తారు. 1-1 సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను , 2-3 సంవత్సరాల మధ్య పిల్లలకు పూర్తి మాత్రను మెత్తగా పొడి చేసి నీటిలో కలిపి ఇవ్వాలి. 3-19 మధ్య వయస్కులైన పిల్లలు మాత్రం పూర్తి మాత్రను సరిగ్గా నమిలి మింగేలా వారికి వివరించాలి. కార్యక్రమం అమలుకు ముందు సన్నద్ధత కోసం రాష్ట్ర స్థాయిలో జనవరి 31వ తేదీన అన్ని విభాగాల అధికారులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటి వరకూ రెండుసార్లు జిల్లా స్థాయీ సమీక్షా సమావేశాలు నిర్వహించి సన్నద్ధతను సమీక్షించారు. అదే విధంగా మండల స్థాయిలో సైతం 3,850 సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఎంపిడిఓ, ఎఎన్ఎంలు విద్యా సంస్థలకు మందుల పంపిణీ బాధ్యత నిర్వహిస్తారు. ఎఎన్ఎంలు, తమ ప్రాంతంలోని అంగన్ వాడీ కేంద్రాలు, విద్యా సంస్థలకు మాత్రలు, పోస్టర్లు, కరపత్రాలు, రిపోర్టింగ్ ఫారాలను అందజేస్తారు. 1-5 సంవత్సరాల వయసు గల నమోదు కాని పిల్లలు, 6-19 మధ్య వయస్కులైన పాఠశాలలకు వెళ్లని పిల్లల జాబితాలను ఆశావర్కర్లు సిద్ధం చేయాలని, వారిని అంగన్వాడీ కేంద్రాలకు తరలించాలని వైద్య ఆరోగ్య సూచించింది. అదే విధంగా అంగన్వాడీ వర్కర్లు, విద్యా సంస్థలు ఉపాధ్యాయులు అన్ని మందులు, పోస్టర్లు, కరపత్రాలు, రిపోర్టింగ్ ఫారాలు, సురక్షితమైన తాగునీరు, ఓఆర్ఎస్ మాత్రలు, శుభ్రమైన స్పూన్లు, హాజరు రిజిస్టర్ల వంటి వాటిని సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఈ నెల 9న అన్ని అంగన్వాడీ కేంద్రాలు, విద్యా సంస్థల్లో సూచించిన మోతాదు ప్రకారం అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలని సూచించింది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ సంస్థలలో డివార్మింగ్ కార్యక్రమాన్ని అనుమతించాలని స్పష్టం చేసింది. ఈనెల 9న ఆరోగ్య సమస్యల కారణంగా గైర్హాజరు కావటం లేదా ఇతర కారణాల వల్ల నులిపురుగుల నిర్మూలన జరగని పిల్లల జాబితాను అంగన్వాడీ వర్కర్లు, టీచర్లు సిద్ధం చేసుకుని వారికి ఫిబ్రవరి 16వ తేదీన ఈ మాత్రలను అందజేస్తారని తెలిపింది. ఈ రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పరిశీలించటం కోసం సంబంధిత ప్రభుత్వ విభాగాలకు చెందిన ఎవిడెన్స్ (ఎన్హెచ్ఎంతో సాంకేతిక, అవగాహనా ఒప్పందం కలిగి వున్న) సంస్థలకు చెందిన పర్యవేక్షకులు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలను సందర్శిస్తారని తెలిపింది. దీంతో పాటు ఎవిడెన్స్ యాక్షన్ నుండి టెలికాలర్లు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యా సంస్థలకు ఫోన్ చేసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు సేకరిస్తారని వివరించింది. ఇందుకు సంబంధించి ప్రతి అంగన్వాడీ కేంద్రం, పాఠశాల వద్ద సమీప పిహెచ్సి, ఎఎన్ఎం కాంటాక్ట్ నెంబర్ వుండాలని సూచించింది. కొంతమంది పిల్లలు వికారం, వాంతులు, విరోజనాలు, బలహీనత వంటి ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం వున్నప్పటికీ, ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమేనని, వీటిని సులభంగా తగ్గించవచ్చని సూచంచింది. ప్రతికూల సంఘటన జరిగిన సమయంలో పిల్లలను నీడ వున్న బహిరంగ ప్రదేశంలో పడుకోబెట్టి వారికి తాగునీరు అందించాలని తెలిపింది. మాత్ర గొంతులో ఇరుక్కోవటం వంటి ఘటనలో చోటు చేసుకున్నప్పుడు వారిని బోర్లా పడుకోబెట్టి వీపుపై తట్టాలని సూచించింది. ఒక వేళ తీవ్రమైన సందర్భాలు ఎదురైతే 104, 108 సేవలను వినియోగించుకోవాలని సూచించింది.