అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్
గవర్నర్ ప్రసంగంలోని అంశాలపై టీడీపీ సభ్యుల అభ్యంతరం
సార్.. మీతో అబద్ధాలు చెప్పిస్తున్నారంటూ నిరసన
నినాదాల మధ్యే ప్రసంగాన్ని కొనసాగించిన గవర్నర్
వెలగపూడి : ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్..మీతో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందంటూ నిరసన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని విమర్శించారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని అన్నారు. విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశామని గవర్నర్ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కాదు..దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభలో తీవ్ర నిరసన నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
ఫిబ్రవరి 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
బీఏసీ సమావేశంలో నిర్ణయం
ఉదయం 11 గంటలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి
అమరావతి : ఈనెల 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశమైంది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బుధవారం (ఫిబ్రవరి 7) అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈనెల 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశమైంది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బుధవారం (ఫిబ్రవరి 7) అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్‌తో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. కాగా బీఏసీ సమావేశాన్ని టీడీపీ బాయ్‌కాట్ చేసింది. అసెంబ్లీ బీఏసీ సమావేశాన్ని బహిష్కరించాలని టీడీఎల్పీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే టీడీపీ సభ్యులు లేకుండా బీఏసీ సమావేశం జరిగింది.
అందుకే సభను బహిష్కరించాం : టీడీపీ
గుంటూరు : ఏపీ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. పసుపు కండువాలు వేసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్దాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. ముందుగా జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి రీయింబర్స్మెంట్ ఇచ్చామని గవర్నర్ చెప్పగా పూర్తి రీయింబర్స్మెంట్ అంతా అబద్దమంటూ తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు. బయటకు వచ్చిన అనంతరం టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ముందుగా తెలుగుదేశం శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని అందుకే సభను బహిష్కరించి బయటకు వచ్చామన్నారు. గోబెల్స్ ప్రచారంతో 36 పేజీల ప్రసంగాన్ని మసిపూసి మారేడుకాయ చేశారని, ప్రభుత్వ అబద్దాలు చదవటానికి గవర్నర్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. ఐదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలకు గవర్నర్ ప్రసంగం అద్దం పడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
తెలుగుదేశం శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో చెప్పిన అబద్దాలు లాంటివే అసెంబ్లీలో గవర్నర్ చేత పలికించారన్నారు. అబద్దాలను కూడా నిస్సిగ్గుగా చెప్పటం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల్ని మోసగించటానికి గవర్నర్‌ను కూడా వాడుకోవడం దుర్మార్గమన్నారు. నచ్చిన సమయానికి అసెంబ్లీ నడుపాతం అన్నట్లు 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఏసీని కూడా బహిష్కరించామని రామానాయుడు తెలిపారు.
ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా స్వామ్యాన్ని నవ్వులపాలు చేసేలా గవర్నర్ ప్రసంగాన్ని ముఖ్యమంత్రి తయారు చేయించారని విమర్శించారు. నాడు – నేడు పులివెందులలో అమలైనట్లు ముఖ్యమంత్రి చూపించగలరా? అని సవాల్ చేస్తున్నానన్నారు. కరవు మండలాల ప్రకటన అవమానంగా భావించి సొంత ప్రాంతానికి ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేశారన్నారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి భయంకరమైన అబద్ధాలు చెప్పించారని ఆయన మండిపడ్డారు.