బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎ .రామిరెడ్డి
విజయవాడ : రాష్ట్రంలోనే తొలిసారిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భావిభారత రూపకల్పనలో యువ న్యాయవాదులు అంశంపై నిర్వహిస్తున్న కార్యశాల కు భారత అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు న్యాయమూర్తులు హాజరవుతున్నారని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎ .రామిరెడ్డి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం అమరావతి హైకోర్టు లో రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
అనంతపురం జేఎన్టీయూ ఆడిటోరియంలో ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అస్సుద్దీన్ అమానుల్లా ఖాన్ , జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎస్ వి భట్టి , రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తులు జస్టిస్ ఏ వి. శేషశాయి, జస్టిస్ దుర్గాప్రసాద్, జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి విషయ నిపుణులుగా పలు అంశాలపై ప్రసంగిస్తారు. వీరితోపాటు జస్టిస్ సురేష్ రెడ్డి జస్టిస్ మన్మధరావు, జస్టిస్ శ్యామ్ సుందర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, వివిధ రాష్ట్రాల ప్రతినిధులుగా ఉన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు గంటా రామారావు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు వివిధ జిల్లాల నుంచి న్యాయవాదులు పాల్గొంటున్నట్టు రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే గత 50 సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమం ఇది తొలిసారి అని, రాష్ట్రంలో న్యాయవాద వృత్తి నైపుణ్యాలను పెంచడానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవకాశం దక్కిందని రామిరెడ్డి పేర్కొన్నారు. త్వరలో యువ న్యాయవాదులకు వృత్తి నైపుణ్యాలు మెరుగుపరిచే శిబిరాలు నిర్వహించడంతో పాటు న్యాయవాద అకాడమీ ఏర్పాటుకు ఈ కార్యక్రమాలు నాంది పలుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.