చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరచాలి
సమస్యలు పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలి
ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు & పలిశెట్టి దామోదర రావు
విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ అవసరాలకు దాచుకున్న జిపిఎఫ్, ఎపిజిఎల్ఐ, డి ఎ, సరెండర్ లీవులు, పిఆర్సి అరియర్స్, పదవీ విరమణ బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రెటరీ జనరల్ పలిసెట్టి దామోదర్ రావు వారి రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీజేఏసీ అమరావతి సంయుక్తంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం చైర్మన్ బొప్పరాజు అధ్యక్షతన నిర్వహించింది. ఈ సమావేశానికి బొప్పరాజు, పలిశెట్టితో పాటు రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు, పలిశెట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు రావలసిన బకాయిలను చెల్లిస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాత్రి అనక పగలనకా నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమై ఉన్న పోలీసులకు రెండు సంవత్సరాల నుండి సరెండర్ లీవ్ లు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి అర్థం చేసుకుని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ క్రింద ప్రతినెలా క్రమం తప్పకుండా చందాలు చెల్లిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందక ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళనలు చెందుతూ తీవ్ర అవస్థలు పడుతున్నారని బొప్పరాజు తెలిపారు. 2022 ఫిబ్రవరిలో ఉద్యమించిన సమయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సమక్షంలో అంగీకరించిన సమస్యలను పరిష్కారంలో జాప్యం చేస్తున్నారని తెలుపుతూ ఇచ్చిన హామీలు అమలు కాకపోతే భవిష్యత్తులో ఉద్యోగులు, పెన్షనర్లు ఇంకా ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నామే తప్ప కొత్త కోరికలు ఏమి కోరలేదని తక్షణమే సమస్యలు పరిష్కరించి ఉద్యోగుల పెన్షనర్లలో ఉన్న ఆందోళన తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని బొప్పరాజు, పలిసెట్టి తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెనువెంటనే పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యోగులు కుటుంబ అవసరాలకు దాచుకున్న నగదు చెల్లింపుల్లో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిందని నేటికీ ఎలాంటి చెల్లింపులు జరగలేదని కనీసం ప్రభుత్వం వైపు నుండి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేకపోవడం దారుణం అన్నారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించాల్సిన 7500 కోట్ల రూపాయల నగదును వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ పిటిడి ఉద్యోగులకు విలీనంకు ముందున్న వైద్య సౌకర్యాలతో పాటు అన్ని సౌకర్యాలు ఇన్సెంటివ్, స్కీమ్స్ అలవెన్స్ లో చెల్లించాలని, 2020 నుండి పెండింగ్లో ఉన్న లీవ్ ఎన్కాష్మెంట్ తో పాటు చనిపోయిన, రిటైర్డ్, వీఆర్ఎస్, మెడికల్ ఆన్ ఫిట్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్లు కూడా ఇవ్వకపోవడం చాలా దారుణం అని బొప్పరాజు, పలిసెట్టి తెలిపారు. 11వ పిఆర్సి అమలులో ఉద్యోగులకు సరైన న్యాయం జరగనప్పటికీ కొన్ని అంశాల్లో నేటికీ స్పష్టత ఇవ్వకపోవడం అలాగే పిఆర్సి కమిషనర్ చేసిన సిఫారసులను కొత్త పే స్కేల్ ను నేటికీ అమలు చేయకపోవడం తదితర విషయాలపై ప్రభుత్వ ఉద్యోగులను గందరగోళానికి కురిచేయడం సరికాదని బొప్పరాజు, పలిశెట్టి తెలియజేశారు. 12వ పిఆర్సి కమిషన్ వేసి ఏడు నెలలు గడుస్తున్న నేటికీ చైర్మన్కు ఆఫీసుగానీ, సిబ్బందిని గానీ నియమించకపోవడం ఎంత దారుణమో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలన్నారు.
తహసిల్దార్ రమణయ్యకు ఘన నివాళి.
విశాఖపట్నంలో శనివారం దారుణ హత్యకు గురైన తహసిల్దార్ రమణయ్య కు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏపీ జేఏసీ అమరావతి ఘనంగా నివాళులర్పించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభానికి ముందు దివంగత తహసిల్దార్ రమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటిస్తూ మృతికి కారణమైన దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించి రమణయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు చేబ్రోలు కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు టీవీ ఫణిపెర్రాజు, వివి మురళీకృష్ణ నాయుడు, చేబ్రోలు కృష్ణమూర్తి, బి కిషోర్ కుమార్, ఎస్ మల్లేశ్వరరావు, బి విజయకుమార్, ఎస్ శ్రీనివాసరావు, పి ఎస్ ఎస్ ఎన్ పి శాస్త్రి, జి శివానందరెడ్డి, పివి రమణ, జి ఆర్లయ్య, జి జ్యోతి, డి ఈశ్వర్, ఏ సాంబశివరావు, కె సుమన్, అల్లం సురేష్ తో పాటు క్యాపిటల్ సిటీ చైర్మన్ దుర్గాప్రసాద్, శంకర్రావు రాష్ట్ర మహిళా విభాగం చైర్ పర్సన్ పారే లక్ష్మి ,ప్రధాన కార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి ఏపీజేఏసీ అమరావతి సెక్రటేరియట్ సభ్యులు మరియు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.