వెలగపూడి : రాష్ట్రంలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి గల గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటికి ఇబ్బంది కలగకుండా వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు.బీశుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన కరువు, విపత్తుల నిర్వహణపై తదనంతర చర్యలపై అధికారులతో సమీక్షించారు. ముందుగా రానున్న వేసవి దృష్ట్యా రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బంది ఉండే గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పంచాయితీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు. వివిధ రక్షిత మంచినీటి పధకాలు,ఇతర తాగునీటి సోర్సులన్నిటినీ పూర్తిగా అందుబాటులో ఉంచుకుని వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది కలగకాండా ఉండేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా తీరప్రాంత మండలాల్లోని గ్రామాలు, గిరిజన మారుమూల ప్రాంతాల్లోని ఆవాసాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది కలగకుండా తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
గత మిచాంగ్ తుఫానుకు దెబ్బతిన్న పంచాయితీరాజ్, ఆర్ అండ్బి తదితర రహదారుల మరమ్మత్తు పనులను వేగవంతంగా చేపట్టేందుకు కేంద్రం నుండి రావాల్సిన కరువు సహాయ నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మిచాంగ్ తుఫాన్ తదనంతరం ఎక్కడైనా పశువులకు దాణా కొరత ఉందా అని సిఎస్ జవహర్ రెడ్డి ఆరా తీయగా ప్రస్తుతం రాష్ట్రంలో దాణా కొరత లేదని వర్చువల్ గా పాల్గొన్న వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. అదే విధంగా మిచాంగ్ తుఫానులో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇతర పరిహారానికి సంబంధించి కేంద్రం నుండి ఈనెలలో నిధులు వచ్చే అవకాశం ఉందని సిఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. కరువు ప్రభావిత మండలాలు సహా ఇతర ప్రాంతాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం కింద తగిన ఉపాధి పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పిఆర్ అండ్ ఆర్డీ అధికారులను ఆదేశించారు. కలక్టర్లు,డ్వామా పిడిలు జిల్లాల్లో ఇందుకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇంకా ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ,కరువు అనంతర చర్యలకు సంబంధించి వివిధ అంశాలపై సిఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ,విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్,పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ కమీషనర్ శేఖర్ బాబు, ఆర్డబ్ల్యుఎస్ ఇఎన్సి ఆర్ వి.కృష్ణారెడ్డిలు వర్చువల్ గా పాల్గొన్నారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ఆర్.కూర్మనాధ్, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.