234 స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్
విమ్స్ లో 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు ఈనెల 9న వాకిన్ రిక్రూట్మెంట్
అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున పోస్టుల నియామకాల పరంపరను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగిస్తోంది. బోధనాసుపత్రులలో 424 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకోసం మొన్ననే నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా గురువారం మరో రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ (నేషనల్ హెల్త్ మిషన్ ) పరిధిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఎస్ఎన్ సియులు, డిఇఐసిలు, ఎన్సిడిల వంటి ఆరోగ్య వ్యవస్థలలో ఖాలీగా వున్న 234 స్పెషలిస్టు డాక్టర్ల నియామకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యసేవల రిక్రూట్మెంట్ బోర్డు సభ్యకార్యదర్శి ఎం. శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతా ప్రమాణాలు, ఇతర మార్గదర్శకాలు వెబ్ సైట్లలో అందుబాటులో వున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఈనెల 7వ తేదీ రాత్రి 11.59 గంటల లోపు తమ దరఖాస్తుల్ని ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు.
విమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా వున్న 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్లు శ్రీనివాసరావు మరో ప్రకటనలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అర్హతా ప్రమాణాలు, సవివరమైన మార్గదర్శకాలు 1.https://dme.ap.nic.in , 2.http://apmsrb.ap.gov.in/msrb/ , వెబ్ సైట్లలో అందుబాటులో వున్నాయని ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఈనెల 9న విశాఖపట్నం హనుమంతవాక జంక్షన్లో వున్న విమ్స్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరిగే వాకిన్ రిక్రూట్మెంట్ కు హాజరు కావాలని ఆయన సూచించారు.