ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : జిల్లాపరిషత్ పరిధిలో పనిచేస్తూ చనిపోయిన ఉపాద్యాయులు/ ప్రధాన ఉపాద్యాయుల కుటుంబాల్లో అర్హత కలిగిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే ప్రభుత్వం కారుణ్య నియామాకాలు చేపట్టాలని
ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.
జిల్లా పరిషత్ పరిధిలో కారుణ్య నియామాకాలు వెంటనే చేపట్టి ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని గురువారం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణని జేఏసీ అమరావతి నేతలు కలిసి వినతి పత్రం సమర్పించగా మంత్రి సానుకూలంగా స్పందించారు. జిల్లా పరిషత్ టీచర్లు, హెడ్ మాస్టర్లు కోవిడ్ ముందు, కోవిడ్ సమయం లోను,కోవిడ్ తర్వాత అనేక మంది చనిపోయినప్పటికి నేటికీ గత ఆరు, ఏడు సంవత్సరాలుగా ఎలాంటి కారుణ్య నియామకాలు చేపట్టనందున, వారందరూ తీవ్ర ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం జిల్లా పరిషత్ పరిధిలో చనిపోయిన ఉద్యోగులు / టీచర్ల కుటుంబాల్లో అర్హత కలిగిన వారికి జిల్లా పరిషత్ పరిధిలో మాత్రమే కారుణ్య నియామకాలు కల్పించాలన్నారు. కానీ మిగిలిన శాఖలలో పనిచేసే ఉద్యోగులకు వారి శాఖలలో ఖాళీలు లేక పోతే, ఇతర శాఖలలో ఖాళీలు ఉండి, తగిన అర్హతలు కలిగి ఉంటే వెంటనే ఉద్యోగాలు ఇవ్వవచ్చు. జిల్లా పరిషత్ పరిధిలో తగిన ఖాళీలు లేనందున గత ఆరు, ఏడు సంవత్సరాలుగా ఎలాంటి కారుణ్య నియామకాలు చేపట్టనందున, వారి కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకొనేలా వారందరికీ కారుణ్యనియామాకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్ఛి ప్రభుత్వం ఆదుకోవాలని, ఇప్పటికే ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర హెడ్ మాస్టర్లు సంఘం పక్షాన గత ఏడాది జూలై 27వ తేదీన కూడా లేఖ ఇవ్వడమే కాకుండా, ఇటీవల ఏపీ జేఏసీ అమరావతి పక్షాన 92 రోజు పాటు జరిగిన ఉద్యమంలో కూడా ప్రభుత్వ పెద్దలు దృష్టికి ఆయా సమావేశాల్లో తీసుకొని వచ్ఛినప్పుడు తప్పకుండా చేస్తామని ఇచ్చిన హామి ఇచ్చిన మేరకు ఈ కుటుంబాలను ఆదుకొనేలా కారుణ్య నియామాకాలు వెంటనే చేపట్టాలని గుర్తు చేస్తూ, గురువారం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ని కలిసి కోవీడ్ కారణంగా రాష్ట్రంలో చనిపోయిన అన్ని శాఖల ఉద్యోగుల (ఆర్టీసీతో సహా) కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించారు కనుక అదే పద్ధతిలో రాష్ట్రంలో కోవిడ్ ముందు, కోవిడ్ సమయం, కోవిడ్ తర్వాత చనిపోయిన జిల్లా పరిషత్ టీచర్లు, హెడ్ మాస్టర్లు కుటుంబం లో అర్హత కలిగిన సభ్యులకు కూడా తక్షణమే కారుణ్య నియామకాలు కల్పించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి పక్షాన నేడు లేఖను అందించగా వెంటనే స్పందించిన బొత్స సత్యనారాయణ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందని ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి తరపున చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గురువారం మంత్రిని కలిసినవారిలో స్టేట్ హెడ్ మాస్టర్లు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్.విజయ రామారావు, గ్రామ వార్డ్ సచివాలయ సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వి.అర్లయ్య, ఎన్టీఆర్ జిల్లా రెవిన్యూ అసోషియేషన్ అధ్యక్షులు డి.శ్రీనివాస్, స్టేట్ ఉమెన్ వింగ్ అసోసియేట్ చైర్ పర్సన్ శివ కుమారి రెడ్డి, రాష్ట్ర వి ఆర్ ఏ ల సంఘం అధ్యక్షుడు జి.బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.