రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డ్ స్టాండింగ్ కమిటీ భేటీ
వైల్డ్ లైఫ్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం
కొల్లేరులో వన్యప్రాణి సంరక్షణ చర్యలపై సమీక్ష
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
వెలగపూడి : వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్ట్ లైఫ్ రెండో స్టాండింగ్ కమిటీ సమావేశం అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో వన్యప్రాణి సంరక్షణ చర్యలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా కొల్లేరు అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టాల అమలు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన అనుమతులపై అధికారులతో చర్చించారు. వన్యప్రాణి కేంద్రాలకు సమీపంలోని గ్రామాల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల కారణంగా వన్యప్రాణి చట్టాలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారులు, ఇతర నిర్మాణాల సందర్భంగా వన్య ప్రాణులకు ఎటువంటి హాని, వాటి సహజ ఆవరణాలకు ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (అటవీ, పర్యావరణం) నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిపిఎఫ్ చిరంజీవి చౌధరి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎకె నాయక్, వైల్ట్ లైఫ్ ఎపిసిపిఎఫ్ శాంతిప్రియ పాండే, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి దీపా తదితరులు పాల్గొన్నారు.