ఏపీకి సోనియా తీరని అన్యాయం చేశారన్న విజయసాయి
దళితులను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూశారని విమర్శ
ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే జగన్ మరోసారి సీఎం కావాలి
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ చేసిన ద్రోహానికి ఆమెను రాష్ట్ర ప్రజలెవరూ క్షమించరని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఆమె చేసిన ద్రోహాన్ని తరతరాలు గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కలిసిపోయిందని అన్నారు. సీఎం జగన్ తోనే సామాజిక న్యాయం సాధ్యమని చెప్పారు. వెనుకబడిన వర్గాలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని అన్నారు. రానున్న ఎన్నికలు ధనికులకు, పేదవారికి మధ్య జరిగే రెఫరెండమని విజయసాయి చెప్పారు. ఎన్నికల యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ప్రతి పేదవాడు జగన్ పక్కన నిలబడి ఆయనను గెలిపిస్తారని విజయసాయి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే జగన్ మరో సారి సీఎం కావాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి మల్లెల రాజేశ్ నాయుడు పోటీ చేస్తారని, ఆయనను గెలిపించాలని ప్రజలను కోరారు.