తెనాలి నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
తెనాలి : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి – సంక్షేమం నినాదంతో.. పేదరిక నిర్మూలన అజెండాతో ముందుకు వెళ్దామని తెలిపారు. రూ.12 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జాడలు మాత్రం కనబడడం లేదన్నారు. ఇప్పుడు సిద్ధం.. సిధ్ధం అంటూ ఎన్నికలు అంటే ఏదో యుద్ధవాతావరణం అన్న భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఆదివారం తెనాలిలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరికీ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఎన్నికల ముందే వైసీపీ ప్రభుత్వం యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది. మన పోరాటం ప్రజాస్వామ్యయుతంగానే ఉండాలి. తెనాలి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత. పొత్తులో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్దాం. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అద్భుతంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతున్నాం. అభివృద్ధి – సంక్షేమం అంటే ఏంటో చేసి చూపిద్దాం. సోమవారం పొన్నూరు నియోజకవర్గంలో నిర్వహించే చంద్రబాబు నాయుడు రా.. కదలిరా.. సభలో జనసేన శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాల”న్నారు.