జర్నలిజం అంటే అభిప్రాయాలను న్యూస్ గా మార్చడం కాదు
అధికార భాషా సంఘం చైర్మన్ పి. విజయ బాబు
గుంటూరు : జర్నలిజం పవిత్ర వృత్తి అని, ఇందులో రాణించాలంటే విషయ పరిజ్ఞానం
అవసరమని సి.ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు.
గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రో. బాల మోహన దాస్ సెమినార్
హాల్ లో శుక్రవారం జరిగిన జర్నలిజం డిప్లమో పరీక్షల్లో ఉత్తీర్ణులైన
అభ్యర్థులకు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలు పంపిణీ
కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. జర్నలిస్టులుగా రాణించాలనుకునే వారు
రాష్ట్రం ఏర్పాటైన 1953 నుంచి జరిగిన పరిణామాలపై సమగ్ర అవగాహన కలిగి వుండాలని
ఆయన అన్నారు. వార్తను వార్త గా రాయడం, రెండో పక్షం అభిప్రాయాన్ని జోడించి
రాయడం, నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేయడం జర్నలిజం మౌలిక సూత్రాలని ఆయన
తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ తో కలిసి సి.ఆర్. మీడియా అకాడమీ నిర్వహించిన
డిప్లమో ను సద్వినియోగం చేసుకుని జర్నలిజం రంగంలో రాణించాలని ఆయన సూచించారు. ఈ
కోర్సు నిర్వహణ లో సహకరించిన వైస్ ఛాన్సలర్ రాజశేఖర్, జర్నలిజం విభాగపు అధిపతి
శ్రీమతి డా. అనిత, కోర్స్ డైరెక్టర్ గా వ్యవహరించిన బి. ఆర్. అంబెడ్కర్
యూనివర్సిటీ స్టూడెంట్స్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ శ్రీ ఎల్. వి. కె.
రెడ్డిలకు చైర్మన్ కృజ్ఞతలు తెలిపారు.
మాటను మించిన ఆభరణం లేదనేది ఆర్యోక్తి అని, పత్రికల్లో రాసేటప్పుడు గాని,
ప్రసార మాధ్యమాల్లో పలికే టపుడుగాని, సందర్భోచితంగా ఉండేలా చూసుకోవాల్సిన
బాధ్యత జర్నలిస్టుల పై ఉందని అధికార భాషా సంఘం చైర్మన్ పి. విజయ బాబు అన్నారు.
జర్నలిజం అంటే అభిప్రాయాలను న్యూస్ గా మార్చడం కాదని ఆయన అన్నారు. ఫీచర్
జర్నలిజం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, లీగల్ జర్నలిజం వంటి అనేక కొత్త కొత్త
విభాగాలు వస్తున్నాయని, వాటి పై పట్టు సాధించడానికి నిత్యం చదువుతూ వుండాలని
ఆయన కోరారు. సుదీర్ఘ కాలం జర్నలిజం రంగంలో నునిశితత్వం, సున్నితత్వం తో
రాణిస్తోన్న మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావును, సాధారణ
జర్నలిస్టుగా ప్రారంభించి, జాతీయ పత్రిక అయిన హిందూ దిన పత్రిక కు రెసిడెంట్
ఎడిటర్ గా ఎదిగిన రెడ్డం అప్పాజీ ను పాత్రికేయులు రోల్ మోడల్ గా భావించాలని
ఆయన కోరారు.
నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. రాజశేఖర్. పి. మాట్లాడుతూ జర్నలిజం
డిపార్టుమెంటు లో ప్రవేశాలు తగ్గు ముఖం పడుతున్న సంగతిని ప్రస్తావించారు.
అయితే, జర్నలిజం చాలా సాసహసోపేతమైన వృత్తి అని, ఆయన పేర్కొన్నారు. సమాజం
మార్పులను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తెస్తూ, సమాజ మూల్యాంకనంలో
జర్నలిస్టులు భాగస్వాములవుతారని ఆయన అన్నారు. వార్త రాయడం ద్వారా
సాక్ష్యాన్ని నెలకొల్ప గలమని వైస్ ఛాన్సలర్ అన్నారు. అందువల్ల రాయడం అనేది
వ్యక్తుల్ని, సమాజాల్ని ప్రజ్ఞావంతులుగా మారుస్తాయని అన్నారు.
హిందూ దినపత్రిక ఆంధ్ర ప్రదేశ్ రెసిడెంట్ ఎడిటర్ రెడ్డమ్ అప్పాజీ మాట్లాడుతూ ఏ
వృత్తిలోనైనా పోటీ పెరిగినప్పుడు అవకాశాలు కూడా పెరుగుతాయని, జర్నలిజం వృత్తి
కూడా ఇందుకు మినహాయింపు కాదని అన్నారు. అయితే, క్రమశిక్షణ, నిరంతర కృషి
మాత్రమే మనకు మంచి భవిష్యత్తును అందించగలవని ఆయన అన్నారు. వృత్తి నైపుణ్యాన్ని
ఎప్పటి కప్పుడు పెంచుకుంటూ నిత్యం నేర్చుకుంటూ వుండే తత్వాన్ని అలవరచుకోవాలని
ఆయన సూచించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులు నేర్చుకోకుండా ప్రస్తుత పోటీ ప్రపంచం
లో మనుగడ సాగించలేమని ఆయన పేర్కొన్నారు. “ఛాట్ జి పి టి” వంటి సాఫ్ట్ వేర్ లు
ఎన్ని వచ్చినా వాటిని పత్రికకు అన్వయించ గలిగేది జర్నలిస్టు మాత్రమే నని ,
ఇందుకు భాష పై పట్టు సాధించడం ముఖ్యమని ఆయన అన్నారు. ఆధునిక సాఫ్ట్ వేర్ లపై
పరిజ్ఞానం, భాష పై పట్టు వున్నా నైపుణ్యమైన జర్నలిస్టులకోసం మల్టీ నేషనల్
కంపెనీలు ఎదురు చూస్తున్నాయన్నారు.
కోర్సు డైరక్టర్ గా వ్యవహరించిన డా. ఎల్.వి.కె రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం
డిప్లమో కోర్సు ను నిబద్దతతో అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చే లా తీర్చి దిద్ది
నిర్వహిచడంలో సహకరించిన సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని
శ్రీనివాసరావుకు, నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. రాజ శేఖర్ లకు
కృతజ్ఞతలు తెలిపారు. ఈ కోర్సు లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు జర్నలిజం
రంగంలో రాణించాలని ఆయన కోరారు. నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధిపతి
డా.జి. అనిత మాట్లాడుతూ కోర్సు లోని అంశాలుతో పాటు, ప్రతి శనివారం ప్రముఖుల
ద్వారా అందించే సామాజిక, సాంస్కృతిక, చారిత్రాత్మక, అంశాల ద్వారా అభ్యర్థులు
మరిన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేసేలా ఆన్ లైన్ క్లాసులు ఏర్పాటు చేయడం మంచి
పరిణామం అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ అధికార భాష సంఘం చైర్మన్ పి. విజయబాబు సతీమణి శారద మాట్లాడుతూ
నిత్య విద్యార్థి గా జర్నలిస్టులు కొనసాగాలని అన్నారు. సి.ఆర్. మీడియా అకాడమీ
సెక్రెటరీ శ్రీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ, జర్నలిజంలో డిప్లమా
కోర్సు ను ఆరు నెలల పాటు నిర్వహించి, అక్టోబర్ లో పరీక్షలు నిర్వహించడం
జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన అందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డిప్లమో ఇన్
జర్నలిజం లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు ప్రొవిజనల్ సర్టిఫికెట్ లు, మార్కుల
మెమోలు వైస్ ఛాన్సలర్ ప్రొ. రాజ శేఖర్,మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని
శ్రీనివాసరావు అందించారు.